ఓటు హక్కు వినియోగంపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వీడియో సందేశం ఇచ్చారు. అందరూ విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటు ద్వారా పంచాయతీలకు జవసత్వాలు వస్తాయని వ్యాఖ్యానించారు.

ప్రజాస్వామ్య వ్యవస్థను ఆశీర్వదించాలని నిమ్మగడ్డ విజ్ఞప్తి చేశారు. గ్రామపంచాయతీలకు నాలుగు విడతలుగా ఈనెల 9,13, 17,21 జరుగనున్నాయని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పూర్తి భద్రత ఏర్పాట్ల మధ్య అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కోరారు.

Also Read:నిమ్మగడ్డకు షాక్: మంత్రి పెద్దిరెడ్డిపై ఎస్ఈసీ ఆదేశాలను కొట్టేసిన ఏపీ హైకోర్టు

మరోవైపు బలవంతపు ఏకగ్రీవాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ముందు నుంచే దృష్టి సారించింది. దౌర్జన్యాలకు సహకరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. అంతకుముందు ఎస్‌ఈసీని తేలిగ్గా తీసుకున్న యంత్రాంగంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మార్పు కనిపించింది.

ఎస్‌ఈసీ సిఫారసు మేరకు ఇద్దరు కలెక్టర్లు, ఒక ఎస్పీ, పలువురు సీఐలపై చర్యలు తీసుకోవడం... ఇతరులకు హెచ్చరికగా మారింది. గతంలోలాగా అధికార పార్టీకి బహిరంగంగా సహకరించేందుకు జంకారు.

అయితే సర్కారు పెద్దలకు ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరగడమే ఇష్టంలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలకు సరే అన్నప్పటికీ... భారీ స్థాయిలో పంచాయతీలను ఏకపక్షంగా సొంతం చేసుకోవాలనుకున్నారు.