అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి కొడాలి నానిపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న కమిషనర్ కు దురుద్దేశాలు అంటగట్టడమే కాకుండా పలు ఆరోపణలు, విమర్శలు చేశారని కొడాలి నానిపై ఎస్ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకు గాను పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు మీడియాతో మాట్లాడవద్దని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొడాలి నానిని ఆదేశించారు. 

ఆ మేరకు శుక్రవారం పొద్దుపోయిన తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 21వ తేదీ వరకు నాని బహిరంగ సభల్లోనూ గ్రూప్ సమావేశాల్లోనూ మాట్లాడకూడదని ఆదేశించారు. ఈ ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయని చెప్పారు. తన ఆదేశాలను అమలు చేయాలని ఎస్ఈసీ కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీ, విజయవాడ పోలీసు కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశార.

కొడాలి నాని వ్యాఖ్యలను విద్వేషపూరిత ప్రంగంగా ఎస్ఈసీ పరిగణనలోకి తీసుకుంది. కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్  విశ్వభూషణ్ హరిచందన్ ను కోరినట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన ఆదేశాల్లో చెప్పారు. 

కొడాలి నాని వ్యాఖ్యలు రాజ్యాంగబద్దమైన ఎన్నికల కమిషన్ స్వయంప్రతిపత్తిని దెబ్బ తీసే విధంగా ఉన్నాయని నిమ్మగడ్డ అభిప్రాయపడ్డారు. ఎస్ఈసీని అత్యంత తీవ్రంగా అగౌరవపరిచేలా ఉన్నాయని ఆయన అన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి మరో రాజ్యాంగబద్దమైన సంస్థపై, అధికారిపై విద్వేషపూరిత ప్రసంగం చేశారని అన్నారు. 

మంత్రి కొడాలి నానికి ఇది కొత్తేమీ కాదని, గతంలోనూ ఎస్ఈసీపై, కమిషనర్ గా ఉన్న తనపై వ్యక్తిగతంగా తీవ్రమైన, అనుచతిమైన విమర్శలు, ఆరోపణలు చేశారని నిమ్మగడ్డ అన్నారు. వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని దూషణలకు దిగినట్లు ఆయన గుర్తు చేశారు. అయినా తాము శాంతియుతంగా, సంయమనంతో వ్యవహరించామని, కానీ పంచాయతీ ఎన్నికల జరుగుతున్న ప్రస్తుత సమయంలో తీవ్రమైన విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. 

ముఖ్యమంత్రి కూలదోసేందుకు కుట్రలు చేస్తున్నారంటూ అసందర్భమైన ఆరోపణలు చేశారని, ఈ వ్యాఖ్యలు ఎన్నికల సంఘం, కమిషనర్ గౌరవాన్ని దెబ్బ తీసే విధంగా, చులకన చేసేలా ఉన్నాయని అన్నారు. 

శుక్రవారం ఉదయం కొడాలి నాని మీడియాలో చేసిన వ్యాఖ్యలపై షోకాజ్ నోటీసు ఇచ్చామని, తన ప్రసంగాన్ని నిజమైన స్ఫూర్తితో చూడాలని, వాటికి ఏ విధమైన ఉద్దేశాలు ఆపాదించవద్దని ఆయన కోరారని, ఆయన ఇచ్చిన వివరణలో ఇసుమంత కూడా పశ్చాత్తాపం కనిపించలేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. 

వీడియోలో తాను చేసిన ప్రసంగాన్ని కొడాలి నాని కాదనలేదని, ఎస్ఈసీపై చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చలేదని, మంత్రి తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లుగా కనిపిస్తోందని, ఈ స్థితిలో కొడాలి నాని తన వ్యాఖ్యలతో గౌరవంం, నైతికత, మర్యాదలను ఉల్లంఘించి ఉద్దేశపూరితంగా ఎన్నికల కమిషనర్ మీద దాడికి పాల్పడినట్లు అర్థమవుతోందని అన్ారు. ఈ పరిణామాలను పరిశీలించిన తర్వాత కొడాలి నానిపై ఆంక్షలు విధించినట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు.