చంద్రబాబు పూర్తి ఆరోగ్యంతో వున్నారు .. భోజనమైనా పరీక్షించాకే లోపలికి, ఆ వార్తలు నమ్మొద్దు : జైళ్ల శాఖ డీఐజీ
చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై మీడియాలో వస్తున్న కథనాలపై స్పందించారు ఏపీ జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ . చంద్రబాబుకు జైల్లో పూర్తి స్థాయిలో భద్రత వుందని , ఆయనను ఉంచిన బ్యారెక్ చాలా విశాలంగా వుందని డీఐజీ అన్నారు.

రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో వున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై మీడియాలో వస్తున్న కథనాలపై స్పందించారు ఏపీ జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పూర్తి ఆరోగ్యంతో వున్నారని తెలిపారు. స్కిన్ సమస్య రాగానే ప్రభుత్వ వైద్యులతో రూల్స్ ప్రకారం వైద్యం చేయించామని ఆయన చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తాగునీరు , భోజనం విషయంలో నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామన్నారు. మొదటి నుంచి చంద్రబాబును హై ప్రొఫైల్ ఖైదీగానే ట్రీట్ చేస్తున్నామని రవికిరణ్ పేర్కొన్నారు.
జైల్లో చంద్రబాబుకు ఆరోగ్య పరంగా, భద్రతా పరంగా ఎలాంటి సమస్య లేదని ఆయన తెలిపారు. ఒక హెడ్ వార్డెన్ , ఆరుగురు వార్డెన్‌లతో స్నేహ బ్యారెక్‌లో భద్రత ఏర్పాటు చేశామని డీఐజీ వెల్లడించారు. చంద్రబాబుకు జైల్లో పూర్తి స్థాయిలో భద్రత వుందని ఆయన పేర్కొన్నారు. బయటి నుంచి వచ్చిన భోజనాన్ని పరీక్షించిన తర్వాతే చంద్రబాబుకు ఇస్తున్నామని.. జైలు సిబ్బంది ప్రతి రోజు చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని రవికిరణ్ చెప్పారు. చంద్రబాబు పూర్తి ఆరోగ్యంతో వున్నారని.. ఆయనను ఉంచిన బ్యారెక్ చాలా విశాలంగా వుందని డీఐజీ అన్నారు.
చంద్రబాబు ఆరోగ్యంపై బయట నుంచి చేసే ఆరోపణలు కరెక్ట్ కాదని.. ఆయన డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఓఆర్ఎస్ కూడా అందజేస్తున్నామని రవికిరణ్ స్పష్టం చేశారు. జైలుకు వచ్చేటప్పుడు తెచ్చుకున్న మెడిసిన్స్ డాక్టర్ల పర్యవేక్షణలో వాడుతున్నారని తెలిపారు. తాగునీరు, భోజన విషయంలో నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామని రవికిరణ్ పేర్కొన్నారు. 2100 మంది ఖైదీలకు ట్యాంకుల్లో ఉన్న నీటినే సరఫరా చేస్తున్నామని డీఐజీ తెలిపారు.