కాకినాడ: జనసేన పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. ముఖ్యమంత్రి అవ్వాలనే తపనతోనే పవన్ కళ్యాణ్ పనిచేస్తేనే పార్టీకి భవిష్యత్ ఉంటుందని లేకపోతే కష్టమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు రాపాక వరప్రసాదరావు.  

జనసేన పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉందని రాపాక అభిప్రాయపడ్డారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని ఖచ్చితమైన నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 

గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. జిల్లాల వారీగా పార్టీ బలోపేతం అయితే కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను అధికారుల దృష్టికి తీసుకెళ్తారని అవసరమైతే పోరాటాలు చేస్తారని చెప్పుకొచ్చారు. 

ప్రతీదానికి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రావాలి అంటే కష్టమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బరువు అంతా పవన్ కళ్యాణ్ పై పెడితే ఆయన ఎక్కడ మోయగలరంటూ నిలదీశారు. కాబట్టి పార్టీని విస్తృత పరచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 

ఇకపోతే తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు తాను పార్టీ మారతాననే ఆలోచన చేయలేదని కూడా స్పష్టం చేశారు. అయితే భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పలేనని రాజీనామా చేస్తే చేయోచ్చు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

పవన్ కళ్యాణ్ తాను ముఖ్యమంత్రి అవ్వాలి, జనసేనను అధికారంలోకి తీసుకురావాలి అనే తపనతో పనిచేస్తే పార్టీకి భవిష్యత్ ఉంటుందన్నారు. ఇప్పటి వరకు అయితే భవిష్యత్ లేని పార్టీగానే  జనసేన ఉందన్నారు రాపాక వరప్రసాదరావు. 

పవన్ కల్యాణ్ మీద జనసేన ఎమ్మెల్యే రాపాక షాకింగ్ కామెంట్స్..

గతంలో సీఎం వైయస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నారని ఆయన ముఖ్యమంత్రి కావాలనే కాంక్షతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారని చెప్పుకొచ్చారు. దాంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారని ప్రజలు ఆశీర్వదించారని చెప్పుకొచ్చారు. 

ఇకపోతే ఇంగ్లీషు మీడియం విషయంలో అధినేత పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా తాను అసెంబ్లీలో మాట్లాడాన అన్న వ్యాఖ్యలను ఖండించారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ ఇంగ్లీషు మీడియం వద్దు అనలేదని తెలుగుభాషకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారని చెప్పుకొచ్చారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధన శుభపరిణామమన్నారు. ప్రభుత్వం మంచి చేస్తే పొగుడుతానని తప్పు చేస్తే ఖండిస్తానని స్పష్టం చేశారు. మంచి చేసినా ఖండించాలంటే తన వల్లకాదన్నారు. 

నేను దీక్షలో..రాపాక అసెంబ్లీలో: షోకాజ్ నోటీసులపై పవన్ కళ్యాణ్...

ఇకపోతే పార్టీ బలోపేతం కోసం తాను కూడా కొన్ని సూచనలు చేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ ఎక్కువగా పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తోనే సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారని చెప్పుకొచ్చారు.

ఇప్పటి వరకు పార్టీ వీడుతున్న వారంతా పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పై ఆరోపణలు చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ఆయన వ్యవహారశైలివల్లే పార్టీ మారుతున్నామంటూ చెప్పుకొస్తున్నారంటూ తెలిపారు. 

తనకు నాదెండ్ల మనోహర్ తో ఎలాంటి విబేధాలు లేవని చెప్పుకొచ్చారు. ఆయన పనేదో ఆయన చేసుకుంటూ పోతుంటారని అయితే పార్టీలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంటారని చెప్పుకొచ్చారు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. 

ఇకపోతే కాకినాడ రైతు సౌభాగ్య దీక్షకు తాను హాజరుకాబోనని ముందే స్పష్టం చేసినట్లు చెప్పుకొచ్చారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరువుతానని ముందే సమాచారం ఇచ్చానని తెలిపారు. ఆ విషయంలో తనకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు షోకాజ్ నోటీసులపై తాను ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవాలు లేవని చెప్పుకొచ్చారు రాపాక వరప్రసాదరావు. 

నీకంటూ ఓ గుర్తింపు ఉంది, పరువు తీసుకోకు: పవన్ కళ్యాణ్ కు వైసీపీ ఎమ్మెల్యే.