అమరావతి: ఏపీ రాజకీయాల్లో వేలు పెడుతానని.. రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెబుతున్న కేసీఆర్ .... రానున్న ఎన్నికల్లో తమ  అభ్యర్థులను ఏపీలో బరిలోకి దింపాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.ఏపీ ప్రజలతో ఆడుకొంటే ఏం జరుగుతోందో చూస్తారన్నారు.

ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రఘువీరారెడ్డిని  ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వెల్లడించారు.ఏపీ ప్రజలతో ఆడుకొనేందుకు ప్రయత్నిస్తే ప్రజలంతా ఏకతాటిపైకి వస్తారని రఘువీరారెడ్డి హెచ్చరించారు. కేసీఆర్‌కు నిజాయితీ ఉంటే ఏపీ ఎన్నికల్లో  తమ పార్టీ అభ్యర్థులను పోటీ చేయించాలని  కేసీఆర్‌కు రఘువీరా రెడ్డి సవాల్ విసిరారు.

బీజేపీకి మేలు చేసే విధంగా కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని రఘువీరా రెడ్డి అభిప్రాయపడ్డారు.తెలంగాణలో వైసీపీ ఎందుకు ఎన్నికల్లో నిలబడలేదో చెప్పాలని రఘువీరా డిమాండ్ చేశారు.కేసీఆర్‌కు పరోక్షంగా మద్దతిచ్చారని ఆయన విమర్శించారు. బీజేపీకి కూడ పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు.

ప్రత్యేక హోదాను కేసీఆర్, వైసీపీ ఎలా సాధిస్తోందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఏపీకి ప్రత్యేక హోదా, విభజన సమ్యలు  పూర్తి కానున్నాయని చెప్పారు.

ప్రత్యేక హోదా, విభజన హామీలు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతాయని  రఘువీరా రెడ్డి చెప్పారు. రాష్ట్ర విభజన విషయానికి అన్ని పార్టీలు సానుకూలంగా నిర్ణయం తీసుకొన్నప్పటికీ  ఆ నిందను కాంగ్రెస్‌ పార్టీపై వేశారని రఘువీరా చెప్పారు.

1978, 1983, 2014 ఎన్నికల సమయంలో కూడ కాంగ్రెస్ పార్టీ నుండి  కీలక నేతలు పార్టీని వీడిపోయారని రఘువీరా గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తోందన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా  ప్రియాంకగాంధీ బాధ్యతలు చేపట్టిన  తర్వాత పార్టీకి పునరుత్తేజం రానుందన్నారు. వచ్చే ఎన్నికల సమయంలో ప్రియాంక గాంధీని ప్రచారానికి తీసుకొస్తామన్నారు. ప్రియాంక ప్రచారం చేస్తే ప్రజల్లో మార్పు రానుందన్నారు.

ఏపీ ఎన్నికల సమయంలో చిరంజీవి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహిస్తారని రఘువీరారెడ్డి ప్రకటించారు. అయితే తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేయాలని  తెలంగాణకు చెందిన నేతలు చిరంజీవిని ఆహ్వానించారా లేదా అనే విషయం తనకు తెలియదన్నారు.

సినిమా షూటింగ్‌లో చిరంజీవి బిజీగా ఉన్నందునే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని రఘువీరా రెడ్డి చెప్పారు. ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయించనుందని రఘువీరారెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.పొత్తులపై పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉండడం సహజమని చెప్పారు.
ఈ దఫా అసెంబ్లీలో, పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీ అడుగుపెట్టనుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.