అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం తాత జాగీరులా విర్ర‌వీగుతోన్న సీఎం జ‌గ‌న్‌రెడ్డి వైసీపీ మ‌ద్ద‌తుదారులు 95శాతం పంచాయ‌తీల‌లో ఏక‌గ్రీవంగా గెల‌వాల‌ని టార్గెట్ పెట్టారని టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ గుర్తుచేశారు. తొలివిడ‌తలోనే తెలుగుదేశం సైన్యం ఎదురొడ్డి పోరాడి జెండా ఎగరేసిందన్నారు. మ‌లివిడ‌తలో వైసీపీ పెద్ద‌త‌ల‌కాయ‌ల పంచాయ‌తీల్ని సైతం మడతపెట్టిందని...ఇక మూడో విడ‌త‌తో వైసీపీకి మూడనుందంటూ ఎద్దేవా చేశారు. 

''తెలుగుదేశం కార్య‌క‌ర్త నుంచి కార్య‌ద‌ర్శి వ‌ర‌కూ వెన్నుచూప‌ని పోరాటంతోనే పంచాయ‌తీల్లో ప‌ట్టు సాధించాం. టిడిపి అభిమాని నుంచి అధ్య‌క్షుడి వ‌ర‌కూ ప‌డిన క‌ష్టానికి ప్ర‌తిఫ‌లం ఈ సానుకూల ఫ‌లితాలు. బెదిరించి ఏక‌గ్రీవాలు చేసుకోవ‌డం, చంపేస్తామ‌ని హెచ్చ‌రించి విత్‌డ్రా చేయించ‌డమూ విజ‌య‌మేనా జగన్ రెడ్డి! జ‌నం ఇంకా వైకాపా వైపే ఉన్నారని మీకు న‌మ్మ‌కం ఉంటే... ద‌మ్ముంటే అధికార ‌దుర్వినియోగం చేయ‌కుండా 3,4 విడత‌ల్లో పోటీ చేయండి. ఎవరి సత్తా ఏంటో తేలిపోతుంది'' అని లోకేష్ సవాల్ విసిరారు. 

read more  తల్లిని ఓడించారని విశాఖపై జగన్ కక్ష: లోకేష్

ఇక ఈ రెండో విడత పంచాయితీ ఎన్నికల ఫలితాలు వైసీపీ అరాచకాలకు చెంపపెట్టని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. మంత్రులు, ఎంపీల స్వగ్రామాల్లోనూ వైసిపి బలపర్చిన అభ్యర్ధులు ఓటమి పాలవ్వడం జగన్ రెడ్డి పాలనపై వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. 

బూతుల మంత్రి కొడాలి నాని వాడిన భాష, అసభ్య పదజాలం ముఖ్యంగా మాజీ సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను ప్రజలు జీర్ణించుకోలేకోయారు. అందువల్లే ఈ ప్రభుత్వానికే బుద్ధి చెప్పాలన్న ఆలోచన రాష్ట్ర ప్రజల్లో వచ్చిందన్నారు. ప్రజలు 5ఏళ్లు అధికారం ఇస్తే రెండేళ్లకే అయ్యగారి భాగోతం బయటపడిందన్నారు. 

''గ్రామాల్లో ఈ ప్రభుత్వాన్ని ఛీ కొడుతున్నారు. బూతుల మంత్రి స్వగ్రామంలో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వగ్రామం, నగరి వంటి అనేక వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సొంత గ్రామాల్లో ఓటమిపాలయ్యారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం మాకొద్దని ప్రజలు అంటున్నారు. ఈ దొంగల ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధమయ్యారు'' అని రామయ్య అన్నారు.