విజయనగరం : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన "ఛలో ఆత్మకూరు"పిలుపుపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధిపొందేందుకే ఇలాంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చారని మండిపడ్డారు.  

విజయనగరంలో మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ సీఎం జగన్ కు వస్తున్న ప్రజాఆదరణ చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారంటూ మండిపడ్డారు. అందుకే రాష్ట్రంలో గందరగోళం సృష్టించాలని కుట్రపన్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు జిమ్మికులు తనకు తెలుసునంటూ నిప్పులు చెరిగారు. 

అధికారం కోల్పోయినప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తూనే ఉన్నారని కానీ ఎక్కడా సక్సెస్ కాకపోవడంతో ఇప్పుడు వైసీపీ బాధితులు అంటూ కొత్త నాటకానికి తెరలేపారంటూ మండిపడ్డారు. 

పెయిడ్‌ ఆరి​స్టులతో చంద్రబాబు కుటిల రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపైనా ఉందన్నారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులపై ఎక్కువగా ఉందన్నారు. 

శాంతిభద్రతలు అదుపులో ఉండాలనే రాష్ట్రంలో సెక్షన్‌ 30 అమలులో ఉందని చెప్పుకొచ్చారు. సెక్షన్ 30 ఈనాటిది కాదని, గత నాలుగేళ్లుగా కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరిపైనైనా అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. 

మాజీ ఎమ్మెల్యే యరపతినేని అక్రమ మైనింగ్‌ పరిశీలనకు వెళ్లేటప్పుడు తనను కూడ అడ్డుకొని పోలీసు స్టేషన్లకు తరలించిన విషయాన్ని బొత్స గుర్తు చేశారు. అయినప్పటికీ తాము ఎవరిపైనా తప్పుడు కేసులు పెట్టలేదని చెప్పుకొచ్చారు. 

ఇకపోతే మాజీ ప్రభుత్వ విప్ కూన రవి కుమార్‌ అధికారులను నిర్భందించి బెదిరించిన వాస్తవం కాదా? అని నిలదీశారు. ఇకపోతే మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ ఫర్నిచర్‌ను పట్టుకుపోయింది నిజం కాదా? అని ప్రశ్నించారు. 

అలాగే మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధికారులపై దాడి చేయలేదా..? ఎస్సీలను బెదిరించలేదా? అంటూ నిలదీశారు. మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కోర్టు ఆదేశాలు ఇవ్వలేదా? అని చెప్పుకొచ్చారు. 

ఈ కేసుల్లో ప్రభుత్వం ఎక్కడ తప్పుడు కేసులు పెట్టిందో చెప్పాలని చంద్రబాబు నాయుడుని నిలదీశారు బొత్స సత్యనారాయణ. ప్రజా ప్రతినిధులు శాంతి భద్రతకు విఘాతం కల్పించకూడదని చంద్రబాబు నాయుడకు బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

చదువుకున్న వాళ్లకే కులపిచ్చి, జమిలి ఎన్నికలకు ఛాన్స్: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

తాడోపేడో తేల్చుకుంటాం, వదిలిపెట్టను: జగన్ సర్కార్ పై చంద్రబాబు గరంగరం
వేడెక్కిన పల్నాడు: టీడీపీకి పోటీగా.. రేపు వైసీపీ చలో ఆత్మకూరు