అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. రాజకీయ ప్రచారం కోసం చంద్రబాబు నాయుడు తన ఇంటిని కూల్చివేస్తున్నారంటూ ప్రచారం చేసుకుంటున్నారంటూ మండిపడ్డారు. 

చంద్రబాబు నాయుడు ఇల్లు కూల్చివేస్తామన్నది అవాస్తవమన్నారు. రాజకీయంగా లబ్ధిపొందాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేయడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. 

అక్రమ కట్టడాలు తొలగించాలని ఇటీవలే నోటీసులు ఇచ్చామని చెప్పుకొచ్చారు. అక్రమ  కట్టడాలు తాము కూల్చే పరిస్థితి తీసుకురావొద్దని ఎవరైతే అక్రమ కట్టడాలు నిర్మించారో వారు తొలగించాలని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. 

ఇటీవల ఇచ్చిన నోటీసులే ఆఖరి నోటీసులు అని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ల్యాండ్ ఫూలింగ్ అక్కడి వరకే వచ్చి ఎందుకు ఆగిందో చంద్రబాబు నాయుడు చెప్పాలని నిలదీశారు. కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలు చంద్రబాబు ఇళ్లు అయినా సరే కూల్చివేయక తప్పదన్నారు. 

ఒకవేళ కరకట్టపై నిర్మాణాలు సబబేనని అయితే కోర్టుకు వెళ్లొచ్చని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. అక్రమ నివాసంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారో చెప్పాలని నిలదీశారు. అక్రమ నివాసంలో చంద్రబాబు నాయుడు ఉండొచ్చా అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ నిలదీశారు. 

ఇకపోతే కరకట్టపై అక్రమ కట్టడాలను సీఆర్డీఏ అధికారులు కూల్చివేస్తున్నారు. పాతూరి గెస్ట్ హౌజ్ యజమాని నిర్మించిన ర్యాంప్ ను సీఆర్డీఏ అధికారులు కూల్చివేస్తున్నారు. ఇటీవలే అక్రమ కట్టడాలు కూల్చివేయాలంటూ సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ వారు కూల్చకపోవడంతో నేరుగా అధికారులే రంగంలోకి దిగాల్సి వచ్చింది. 

ఈ వార్తలు కూడా చదవండి

అనుమతితోనే నిర్మాణం.. చంద్రబాబు నివాసం పై లింగమనేని రెస్పాన్స్

చంద్రబాబు ఇంటికి మళ్లీ నోటీసులు.. కూల్చివేయడం ఖాయమా..?