అమరావతి: సాధారణ ఎన్నికలకు ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇమేజ్ పెరిగినట్లు కనిపిస్తోంది. టీడీపీ అధినేత, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ గ్రాఫ్ లు పడిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఓట్ల శాతం గణనీయంగా పెరగగా, టీడీపీ ఓట్ల శాతం తగ్గింది. అదే సమయంలో జనసేన ఓట్ల శాతం కూడా తగ్గింది. జనసేనతో పొత్తు పెట్టుకున్న బిజెపి ఓట్ల శాతం పెరిగింది. 

మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి  52.63 శాతం ఓట్లు పోలయ్యాయి. శాసనసభ, లోకసభ సాధారణ ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన ఓట్ల కన్నా మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. కాగా, టీడీపీకి 30.73 శాతం ఓట్లు వచ్చాయి. సాధారణ ఎన్నికల్లో టీడీపీకి 38 శాతం దాకా ఓట్లు వచ్చాయి. సాధారణ ఎన్నికలతో పోలిస్తే చంద్రబాబు గ్రాఫ్ గణనీయంగా పడిపోయినట్లు అర్థమవుతోంది. 

అదే సమయంలో జనసేనకు 4.47 శాతం ఓట్లు పోలయ్యాయి. సాధారణ ఎన్నికల్లో జనసేనకు 6 శాతం దాకా ఓట్లు వచ్చాయి. మున్సిపల్ ఎన్నికల్లో బిజెపికి 2.41 శాతం ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెసు పరిస్థితి దారుణంగానే ఉంది. ఈ పార్టీకి .62 శాతం ఓట్లు వచ్చాయి. సీపీఐకి 0.80 శాతం ఓట్లు సిపిఎంకు 0.81 శాతం ఓట్లు వచ్చాయి నోటాకు 1.07 శాతం ఓట్లు పోలయ్యాయి. 

అయితే, సాధారణ ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటింగ్ సరళి భిన్నంగా ఉంంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు సాధారణంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. దీనికి చాలా కారణాలున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో పోలైన ఓట్లు వచ్చే సాధారణ ఎన్నికల్లో పోలవుతాయని చెప్పలేం. ఏమైనా టీడీపీ మాత్రం అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చిందని మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి.