ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన మంత్రులు ఈ నెల 26 నుంచి బస్సు యాత్ర నిర్వహించనున్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ యాత్ర సందర్భంగా వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలను ప్రజలకు వివరించనున్నారు. 

ఏపీలో వైసీపీ (ysrcp) ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ఉద్దేశంతో రాష్ట్ర కేబినెట్‌లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ‌ర్గాల‌కు చెందిన మంత్రులు రాష్ట్రవ్యాప్తంగా బ‌స్సు యాత్ర‌ను చేప‌ట్ట‌నున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 26న విశాఖ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానున్న‌ట్లుగా తెలుస్తోంది. దీనిపై ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ఓ నిర్ణ‌యం తీసుకోగా.. బ‌స్సు యాత్ర‌కు ఏర్పాట్లు చేసుకోవాలంటూ ఆయా మంత్రుల‌కు ఆదేశాలు జారీ అయిన‌ట్లు తెలుస్తోంది.

ఈ నెల 26 నుంచి 29 వ‌ర‌కు నాలుగు రోజుల పాటు సాగ‌నున్న ఈ యాత్ర‌లో భాగంగా రాష్ట్రంలోని ముఖ్య ప‌ట్ట‌ణాల్లో స‌మావేశాలు నిర్వ‌హిస్తూ వెళ్లనున్నారు మంత్రులు. ఆయా ప‌ట్ట‌ణాల్లో ఏర్పాటు చేసే స‌మావేశాల్లో మాట్లాడ‌నున్న మంత్రులు... ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌తో పాటు చేప‌డుతున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించనున్నారు.

కాగా.. వైఎస్ జగన్ ప్రభుత్వం (ys jagan) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘‘గడప గడపకు మన ప్రభుత్వం’’ (gadapa gadapaku mana prabhutvam) కార్యక్రమానికి జనం నుంచి నిరసన సెగ ఎదురవుతోంది. అనేక ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజలు నిలదీస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు వైసిపి ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధికి (kokkiligadda rakshana nidhi) సొంత నియోజకవర్గంలో చుక్కెదురయ్యింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన ఇవాళ (మంగళవారం) ఎ.కొండూరు మండలం కోడూరులో పర్యటించారు. ఈ క్రమంలోనే ప్రజలతో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఓ మహిళ ఎమ్మెల్యేను నిలదీసింది.

వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క మంచి పనైనా చేసారా? అంటూ ఎమ్మెల్యే రక్షణనిధిని నడిరోడ్డుపై అందరిముందే ఓ మహిళ నిలదీసింది. గూడు లేని నిరుపేదలకు పక్కా ఇళ్లు కట్టివ్వకుండా, మౌళిక సదుపాయాల్లో అతి ముఖ్యమైన రహదారులను బాగుచేయలేదని, దీంతో రోడ్లన్ని అధ్వానంగా మారాయని మహిళ తెలిపింది. ఇక జగనన్న కాలనీలో ఇళ్లు నిర్మించుకోలేని పరిస్థితి ఉందంటూ సదరు మహిళ ఎమ్మెల్యేను నిలదీసింది.

అడ్డమైన పథకాలు పెట్టారు... ఒక్క మంచి పనైనా చేసారా అంటూ ఎమ్మెల్యే ముందే మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా పలు సమస్యలను ఎమ్మెల్యే వద్ద ఏకరవు పెట్టింది సదరు మహిళ. అయితే ఇవన్నీ నీకేందుకు... నీ వ్యక్తిగత సమస్య ఏమయనా వుంటే అడగాలని వైసిపి నాయకులు తప్పించుకునే ప్రయత్నం చేసారు. ఇలా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే రక్షణనిధికి చేదు అనుభవం ఎదురయ్యింది.