అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఒక కారణమని ఆరోపించారు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రధాని నరేంద్రమోదీ అక్కసు, జగన్ దుర్బుద్ధిల వల్లే ఆర్థిక వ్యవస్థ కుదేలైందని ఆరోపించారు. 

కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వారిద్దరే అడ్డుకున్నారంటూ మండిపడ్డారు. విభజన కింద రావాల్సిన బకాయిలను సైతం రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. పీఎంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తిష్టవేసి మోదీలో అపోహలు పెంచారని ఫలితంగా ఏపీకి నిధులు రాలేదన్నారు. 

అంతేకాకుండా వైసీపీ ఎంపీలతో పదేపదే ఫిర్యాదులు చేయించారని చివరికి ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే నిధులను కూడా అడ్డుకునేందుకు కుట్రలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధికి వైసీపీ, బీజేపీలు తీవ్ర అన్యాయం చేశాయన్నారు. 

వైసీపీ, బీజేపీలు ఎన్నికుట్రలు పన్నినానా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లామని స్పష్టం చేశారు. స్థానిక వనరులను సమీకరించి ఎంతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కీలకమైన ప్రాజెక్టులను పూర్తి చెయ్యడమే కాకుండా  ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చెయ్యడంలో విజయవంతమైనట్లు తెలిపారు. 

అత్యంత ప్రతిష్టాత్మంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు పనులను 70శాతం పూర్తి చెయ్యడమే కాకుండా మరో 23 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. రాష్ట్రాలకు కంటింజెన్సీ నిధులు ఇవ్వకుండా ఆర్బీఐని అడుగడుగునా మోదీ ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. 

ఆర్బీఐతో రాష్ట్రాల సంబంధాలకు గండికొట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇటీవల  జరిగిన ఎన్నికల్లో వైసీపీ, బీజేపీ దుర్మార్గపు పోకడలను వ్యతిరేకిస్తూ ప్రజలు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఓటేశారని యనమల అభిప్రాయపడ్డారు.