ఆ టేపుల గురించి మాట్లాడిన జగన్ వీటి గురించి ఎందుకు మాట్లాడరు..?

కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ విఫలయత్నం చేసిందని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ బేరసారాల్లో భాగంగానే గాలి జనార్ధన్‌రెడ్డి, శ్రీరాములు... కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలతో ఫోన్ ద్వారా కోనుగోళ్ళుకు దిగారన్నారు. గాలి మాట్లాడిన ఆడియో టేపులపై బీజేపీ అధిష్టానం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. గాలిని ఉపయోగించి బేరసారాలకు ప్రోత్సహించింది బీజేపీ కాదా అని నిలదీశారు.

ఈ వ్యవహారంలో బీజేపీ ఎందుకు మౌనంగా ఉందని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణలో టేపుల సంబాషణ గురించి పదేపదే మాట్లాడుతున్న జగన్... గాలి జనార్ధన్‌రెడ్డి బేరసారాలు జరిపిన టేపులపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కర్ణాటకలో బయటపడ్డ ఆడియో టేపులపై భాజపా, జగన్, పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడం లేదని, దీనిపై ప్రజలు ఏమి అర్థం చేసుకోవాలని అన్నారు.

గాలిజనార్థన్‌రెడ్డి తనకు దేవుడిచ్చిన అన్న కాబట్టి అతని ఆడియో టేపులపై మాట్లాడటం లేదా అని జగన్‌పై ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలతో జరిపిన బేరసారాలపై ఆడియో టేపులపై విచారణ జరిపి నిజనిజాలను చెప్పవలసిన బాధ్యత కేంద్రప్రభుత్వంపై ఉందని మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు