లోకేశ్ నీ లొకేషన్ ఎక్కడా? తల్లీ, భార్య మీద భారం వేసి పలాయనం: మంత్రి రోజా సెటైర్లు
నారా లోకేశ్ నీ లొకేషన్ ఎక్కడా? అంటూ ఏపీ మంత్రి రోజా సెల్వమణి కామెంట్ చేశారు. తండ్రి అరెస్టు అయితే తనను తాను రక్షించుకోవడానికి ఢిల్లీకి వెళ్లాడని, భారమంతా తల్లి, భార్య మీద వదిలి పలాయనం చిత్తగించిన పులకేశి లోకేశ్ అని సెటైర్లు వేశారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా సెల్వమణి నారా లోకేశ్ పై సెటైర్లు వేశారు. స్కిల్ స్కాం కేసులో సీఐడీ ఈ రోజు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడును విచారించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబుకు తొలి కస్టడీ డే శుభాకాంక్షలు అంటూ మంత్రి రోజా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంలో ఆయన కొడుకు నారా లోకేశ్ పై కామెంట్లు చేశారు. లోకేశ్ నీ లొకేషన్ ఎక్కడా? అంటూ ప్రశ్నించారు. తల్లి, భార్య మీద భారం వదిలి పలాయనం చిత్తగించావా? అంటూ విమర్శించారు.
నారా చంద్రబాబు నాయుడు దేశంలోనే అవినీతి అనకొండ అని మంత్రి రోజా అన్నారు. ఖైదీ నెంబర్ 7691 అని పేర్కొన్నారు. తండ్రి అడ్డంగా తినేసి జైలుకు వెళ్లితే ఆయన కడుపున పుట్టిన లోకేశ్ మాత్రం పలాయనం చిత్తగించాడని ట్వీట్ చేశారు. నాన్న ఎలా పోయినా పర్లేదనుకుని, తాను అరెస్టు కావొద్దని లోకేశ్ పారిపోయాడని, ఆయన తిరిగి ఆంధ్రాకు ఎప్పుడు వస్తాడని ప్రశ్నించారు. పలాయనం చిత్తగించిన పులకేశీ అని సెటైర్లు వేశారు.
Also Read: ఆ హీరోయిన్ పెళ్లికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. వివాహ వేదిక వద్దకు చేరుకున్న సీఎంలు
తండ్రి అవినీతి మీద బహిరంగ చర్చకు రమ్మని సవాల్ చేసిన లోకేశ్ ఆంధ్ర వదిలి పారిపోయాడని, ఆయన మామ బాలయ్య అసెంబ్లీ వదిలి పారిపోయాడని మంత్రి రోజా అన్నారు. తాము చంద్రబాబును గజదొంగ అని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని, కాదని నిరూపించే ధైర్యం ఉన్నదా? ధైర్యమే ఉంటే మీలో ఎవరు అసెంబ్లీకి వస్తారో రావాలని, ఇది వైసీపీ సవాల్ అని పేర్కొన్నారు.