దొంగల చేతి వాటానికి అప్పుడప్పుడు సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా బలవుతూ ఉంటారు. దీనికి నిదర్శనంగా ఏకంగా మంత్రిగారి సెల్‌ఫోన్‌నే దొంగలు దోచేశారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ సమాచారం, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని మొబైల్‌ను ఆగంతకులు చోరీ చేశారు.

Also Read:కియాపై తప్పుడు ప్రచారం, చర్యలు తప్పవు:బుగ్గన

బుధవారం సచివాలయంలో మంత్రి పలు సమావేశాలకు హాజరయ్యారు. ముందు ఆర్ధిక శాఖ సమీక్షకు హాజరైన తర్వాత సందర్శకులతో భేటీ అయ్యారు. ఆ తర్వాత సెక్రటేరియేట్‌లో వివిధ శాఖల సమావేశాల్లో పాల్గొని.. మధ్యాహ్నం క్యాంటీన్‌లో భోజనానికి వెళ్లారు.

ఆ సమయంలో ఫోన్ కోసం వెతగ్గా అది కనిపించలేదు. దీంతో సెల్‌ఫోన్ పోయినట్లు గుర్తించి భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సిగ్నల్స్ ద్వారా గుర్తించగా ఫోన్ అప్పటికే ఏపీ సరిహద్దు దాటేసినట్లు తేలింది. తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఫోన్ ఉన్నట్లుగా గుర్తించారు.

Also Read:బెంబేలెత్తుతున్నారు: కియా తరలింపు వార్తలపై చంద్రబాబు వ్యాఖ్య

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఉండే సచివాలయంలో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయే చోట ఏకంగా మంత్రి ఫోన్ పోవడం కలకలం రేపుతోంది.