విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన అక్రమాలకు ప్రజావేదికను అడ్డం పెట్టుకున్నారని ఆరోపించారు ఏపీ మంత్రి పేర్ని నాని. ప్రజావేదిక కోసం రూ.8కోట్లు ఖర్చుపెట్టామని తెలుగుదేశం పార్టీ చేప్తోందని తీరా చూస్తే రేకుల షెడ్డు మాత్రమే కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. 

ప్రజావేదిక పేరుతో కోట్లు తినేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణానది కరకట్టపై భవన నిర్మాణం అక్రమం అని తెలిసినా కూడా చంద్రబాబు ప్రజాధనాన్ని వృధాచేసిందని ఆరోపించారు. 

చంద్రబాబు తన  అక్రమ నివాసాన్ని కాపాడుకునేందుకే ప్రజా వేదికను నిర్మించారని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. చట్టాలంటే చంద్రబాబుకు ఏమాత్రం గౌరవం లేదని విమర్శించారు. జాతీయ హరిత ట్రిబ్యునల్‌ నిబంధనల పట్ల ముఖ్యమంత్రిగా ఏనాడు చిత్తశుద్దితో వ్యవహరించలేదని ధ్వజమెత్తారు.

ప్రజావేదికలో ఉన్న విలువైన పరికరాలను మళ్లీ వాడుకునేందుకు అధికారులు వాటిని సెక్రటేరియట్ కు తరలించారని స్పష్టం చేశారు. సాధ్యమైనంత వరకు నష్టాన్ని తగ్గించేలా చూస్తున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు.