కేవలం నెల రోజుల వ్యవధిలో ఏపీ రాజధాని అమరావతిలో హైకోర్టు నిర్మాణం పూర్తి చేస్తామని ఏపీ మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. సోమవారం ఉమ్మడి హైకోర్టుకి చివరి రోజు అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన అమరావతిలో హైకోర్టు నిర్మాణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... కోర్టు చుట్టూ పార్కింగ్, లాన్, ఫ్లోరింగ్ పనులు, కోర్టులో జడ్జి రూమ్స్ జనవరి 15 కి పూర్తవుతాయని మంత్రి అన్నారు. కోర్టు ఔట్ సైడ్ వాల్ వర్క్స్ 50 శాతం పూర్తయ్యాయని రాబోయే 10 రోజుల్లో పూర్తిస్థాయిలో సిద్ధమవుతాయని అన్నారు. 

కోర్టులో మొదటి ఫ్లోర్ లో 12 గదులు, రెండో ఫ్లోర్ లో 4 గదులు సిద్ధమవుతున్నాయని పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. రాబోయే 5 రోజుల్లో బ్రిక్స్ వర్క్ పూర్తవుతుందని తెలిపారు. ఏపీలో హైకోర్టు కార్యకలాపాలు జనవరి 1 నుంచి జరపాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. ఒక నెల ముందు తమకు సమాచారం ఇవ్వాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.

రాజధాని నిర్మాణానికి సాయం చేయకుండా రాష్ట్రం పై కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి విమర్శించారు. రాజధాని నిర్మాణానికి 48 వేల కోట్లతో డీపీఆర్ పంపినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. విగ్రహాలకు 3వేల కోట్లు ఖర్చు చేసిన బీజేపీ ప్రజల రాజధాని అమరావతికి కేవలం 1500కోట్లు మాత్రమే ఇవ్వడం దారుణమని మంత్రి అన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి నారాయణ అన్నారు.