విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో మళ్లీ తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయమని ఏపీ మంత్రి నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. ఏపీకి మళ్లీ చంద్రబాబు నాయుడే సీఎం అంటూ జోస్యం చెప్పారు. 

సంపూర్ణ మెజారిటీతో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలో ఓ షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నఆయన ఈసీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రగిరిలో రీపోలింగ్‌పై కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. 

40 రోజుల తర్వాత రీపోలింగ్ నిర్వహించడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో రిగ్గింగ్ జరిగిందంటూ ఈసీ విడుదల చేస్తామంటున్న వీడియోలు నిజమో కాదో చూడాలన్నారు. రీపోలింగ్‌పై తమ ఫిర్యాదులను ఈసీ పట్టించుకోలేదు. 

ఈసీపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు. మోదీ కమిషన్ ఆఫ్ ఇండియాగా ఎలక్షన్ కమిషన్ మారిందన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా బెంగాల్ లో ఆర్టికల్ 324 అమలు చేసి ప్రచారం నిలిపివేయడం బాధాకరమన్నారు నారా లోకేష్.