విశాఖపట్టణం:విశాఖపట్టణంలోని ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీలో స్టైరిన్ గ్యాస్ లీకేజీ ఘటనపై విచారణ జరిపిస్తామని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ప్రకటించారు. 

గురువారం నాడు ఉదయం ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. గురువారం నాడు తెల్లవారుజామున ఎల్జీ పాలీమర్స్ లో ప్రమాదం జరిగిన విషయం తనకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం వచ్చిందన్నారు. 

వెంటనే తాను పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులను అప్రమత్తం చేశామన్నారు. విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తో కూడ ఫోన్ లో మాట్లాడినట్టుగా ఆయన చెప్పారు. హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించినట్టుగా మంత్రి గౌతం రెడ్డి గుర్తు చేశారు. ప్రాణ నష్టాన్ని నివారించేందుకు చర్యలు తీసుకొన్నామన్నారు. 

also read:విశాఖలో గ్యాస్ లీకేజీపై ఫోరెన్సిక్ టీమ్ విచారణ: ఏపీ డీజీపీ సవాంగ్

ఈ గ్యాస్ లీకేజీ ఘటనకు తమ నిర్లక్ష్యం లేదని ఫ్యాక్టరీ యాజమాన్యం నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.పరిశ్రమకు చుట్టుపక్కల గ్రామాలైన నరవ, ఆర్ఆర్‌పురం, టైలర్స్ కాలనీ, బాపూజీ నగర్, కంపరపాలెం, కృష్ణనగర్ ప్రజలకు సహాయంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.

ప్రమాదం జరిగిన ప్రాంతంలో గాలి సాధారణ స్థితికి చేరుకొందని మంత్రి ప్రకటించారు. గ్యాస్ లీకేజీ అదుపులోకి రావడంతో గాలిలో గ్యాస్ లక్షణాలు కన్పించడం లేదని ఆయన తెలిపారు. స్థానికులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించిన ప్రతి ఒక్కరిని మంత్రి అభినందించారు. మరో వైపు ఈ ఘటనపై ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీపై పోలీసులు కేసు నమోదు చేశారు.