తాడేపల్లి: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. విచారణలు ఎదుర్కునే దమ్ములు లేకపోతే చంద్రబాబు జగన్ కాళ్లు పట్టుకోవచ్చు కదా అని ఆయన అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కాళ్లు పట్టుకుని విచారణలను ఆపించుకున్నారని ఆయన అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. విచారణలను తప్పించుకున్న చరిత్ర చంద్రబాబుకు ఉందని ఆయన అన్నారు.

మీడియాపై కూడా ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. ఓ వర్గం మీడియా తమ సామాజిక వర్గం కోసం చంద్రబాబును ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టాలని రోజూ ఏదో వార్తలు రాస్తూ ఉందని ఆయన అన్నారు. బలం లేకున్నా సరే చంద్రబాబును కూర్చోబెట్టి రాష్ట్రాన్ని దోచుకు తినాలని చూస్తోందని ఆయన అన్నారు. 

అమరావతి భూ కుంభకోణాలపై విచారణలు జరిపిస్తుంటే కోర్టుకు వెళ్లి వాటిని ఆపించారని ఆయన అన్నారు. అమరావతిలో చంద్రబాబు బినామీలు ఇన్ సైడ్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. చంద్రబాబుపై వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకోవాల్సిన అవసరం జగన్ కు గానీ వైసీపీకి గానీ లేదని ఆయన అన్నారు. చంద్రబాబు చచ్చిన పాము అని ఆయన అన్నారు. రాజధాని ప్రకటనకు ముందే అమరావతిలో చంద్రబాబు అనుచరులు భూములు కొన్నారని ఆయన చెప్పారు.

అమరావతి భూ కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలని జగన్ కేంద్రాన్ని కోరారని, ఆరు నెలలు గడిచినా కేంద్రం నుంచి స్పందన రాలేదని, దీంతో తానే స్వయంగా పూనుకుని విచారణకు ఆదేశించారని ఆయన చెప్పారు. సీఐడి విచారణను, సిట్ విచారణను కోర్టుకు వెళ్లి ఆపించారని ఆయన అన్నారు. అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆయన అన్నారు. తమ ఎంపీలు పార్లమెంటులో మాట్లాడుతుంటే ఇద్దరు ముగ్గురిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు అడ్డగించే ప్రయత్నం చేశారని ఆయన అన్నారు. 

ఎంతటివారినైనా ఢీకొనే ధైర్యం, దమ్ము ఉన్న మగాడు, నీతిమంతుడు జగన్ అని ఆయన అన్నారు. జగన్ వద్ద పనిచేయడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు.  తమకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందని ఆయన అన్నారు.