రైతుల కష్టాలు పడకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు. గురువారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన .. ఆయిల్ పామ్ ధరల్లో తెలంగాణతో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేందుకు రూ. 80 కోట్లు కేటాయించామని స్పష్టం చేశారు.

ఆయిల్ పామ్ పంట కొనుగోళ్లను టన్నుకు రూ. 11 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. పెదవేగి ఫ్యాక్టరీకి తరలించే ఆయిల్ పాం రైతులకు ఈ ధరలు చెల్లిస్తామని కన్నబాబు చెప్పారు.

ఆయిల్ పామ్ కు మద్దతు ధర ప్రకటించాలని కేంద్రాన్ని కోరామని కన్నబాబు వెల్లడించారు. మార్కెటింగ్ వ్యవస్థను రైతులకు మరింత చేరువయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. వివిధ వాణిజ్య పంటలను ప్రాసెసింగ్ చేయడం ద్వారా రైతులకు మరింత లబ్ది చేకూర్చేందుకు నిర్ణయించామని మంత్రి పేర్కొన్నారు.

త్వరలో ఆహార శుద్ధి పాలసీని ప్రకటిస్తామని.. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలను ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలోకి తెస్తామని కన్నబాబు వెల్లడించారు. ప్రభుత్వమే సొంతంగా ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందన్నారు.

రాష్ట్రంలో ఏదైనా ఓ సంఘటన జరిగితే చంద్రబాబు మహాదానందం పొందుతున్నారని కన్నబాబు ఆరోపించారు. రథం దగ్దమైతే చంద్రబాబు ఆనంద తాండవం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

భక్తి శ్రద్ధలతో జగన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తే ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని ఆయన ప్రతిపక్షాలకు హితవు పలికారు. గతంలో కులాలను అడ్డం పెట్టి రాజకీయం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు మతాన్ని అడ్డం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కన్నబాబు విమర్శించారు.

చంద్రబాబు ఎన్నో గుళ్లను జేసీబీలతో కూలగొట్టించారని ఆయన గుర్తుచేశారు. సీఎం జగన్ ఢిల్లీ టూర్ విషయమై టీడీపీ అనుమానాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదని మంత్రి తేల్చిచెప్పారు.

మేం ప్రజలకు చెబుతాం.. ప్రజలకే జవాబుదారీగా ఉంటామని కన్నబాబు స్పష్టం చేశారు. తానింకా ప్రభుత్వాన్నే నడుపుతున్నానని చంద్రబాబు భావిస్తున్నారని మంత్రి సెటైర్లు వేశారు.