విశాఖపట్నంలో భూ కుంభకోణంలో ప్రమేయం ఉందంటూ  తనపై వస్తున్న ఆరోపణల గంటా శ్రీనివాస్ స్పందించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేకే కొందరు ఇలా అసత్య
ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇలా గతంలో తనపై ఆరోపణలు చేసిన జిల్లా మంత్రి అయ్యన్నపాత్రుడిని ఉద్దేశించి పరోక్షంగా గంటా ఘాటుగా స్పందించారు. 

తనకు భూకుంభకోణంతో సంబంధం ఉందంటూ ఆరోపణలు వస్తుండటంతో నిజానిజాలు ప్రజలకు తెలియజేయాలని భావించానని గంటా తెలిపారు. దీంతో స్వయంగా తానే సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) ను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబును కోరినట్లు తెలిపారు. దీంతో గత సంవత్సరం జూన్ 20న ముగ్గురు సభ్యులతో కూడిని కమిటీని
వేశారని గుర్తుచేశారు. ఈ కమిటీ లక్షా ఇరవై వేల డాక్యుమెంట్లను పరిశీలించి, 300 మందిని విచారించిందన తర్వాతే తనకు ఈ భూకుంభకోణాలతో సంబంధం లేదని క్లీన్ చీట్ ఇచ్చిందని పేర్కొన్నారు. 

1999లో తాను పార్లమెంట్ కు పోటీ చేసినపుడు ఆర్థికంగా ఎలా వున్నానో... ప్రస్తుతం కూడా అలాగే వున్నానన్న గంటా శ్రీనివాస్ స్పష్టం చేశారు. సిట్ నివేదికను రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రవేశ పెట్టామని, అందులో తనపై వచ్చిన ఆరోపణలపై సిట్ బృందం క్లీన్ చీట్ ఇచ్చినట్లు ఉందన్నారు. ఇలా క్లీన్ చీట్ ఇవ్వడం వల్ల ఇక తనను ఎలా ఎదుర్కోవాలో తనపై ఆరోపణలు చేసిన వారికి అర్థం కావడం లేదని గంటా ఎద్దేవా చేశారు.