విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాసరావు సవాల్ విసిరారు. వైఎస్ జగన్ కు దమ్ముంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలని సవాల్ విసిరారు. 

వచ్చే ఎన్నికల్లో తాను భీమిలి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. జగన్ కు దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలన్నారు. జగన్ పోటీ చేసినా, ఎవరు పోటీ చేసినా తాను గెలిచి తీరతానని ధీమా వ్యక్తం చేశారు. 

భీమిలి నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అని మరోసారి నిరూపిస్తానని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.  మంత్రి గంటా శ్రీనివాసరావు వైఎస్ జగన్ కు భీమిలి నియోజకవర్గంపై సవాల్ విసరడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. 

త్వరలోనే గంటా శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతోనే గంటా శ్రీనివాసరావు ఈ వ్యాఖ్యలు చేశారా అన్న చర్చ జరుగుతోంది.