డబ్బులు తీసుకుంటూ సంస్కార హీనంగా మాట్లాడుతున్నారు: ఏపీ మంత్రి ధర్మాన సంచలనం
ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓటేసే ముందు ఆలోచించాలని ఆయన కోరారు.
శ్రీకాకుళం: ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికల్లో జగన్ ను మరోసారి గెలిపించకపోతే మన చేతులు మనం నరుక్కొన్నట్టేనని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు.సోమవారంనాడు జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు.ఓటు వేసే సమయంలో మనసు చెప్పింది వినాలని మంత్రి కోరారు.
తన ఇంట్లో నుండి సీఎం జగన్ పథకాలు ఇస్తున్నారా అని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి డబ్బులు తీసుకుంటూ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. మాట్లాడేందుకు ఏం లేకపోవడంతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని కూడా విమర్శలు చేస్తున్నారని మంత్రి మంండిపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో నిత్యావసర సరుకుల ధరలు ఎంతో తెులసుకోవాలని ఆయన సూచించారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన అప్పులను కూడా తీర్చిందని ఆయన గుర్తు చేశారు. ఇచ్చిన మాటను జగన్ నిలుపుకున్నాడన్నారు. వాగ్దానాలను అమలు చేయని వారిని గెలిపిస్తారో, మాట నిలుపుకొన్న జగన్ గెలిపిస్తారో ఆలోచించుకోవాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరారు.
వచ్చే ఎన్నికల్లో తాను గెలవకపోతే వచ్చే నష్టం లేదన్నారు. తాను పోటీ చేసి గెలవడం, ఓడిపోవడం ఇష్యూనే కాదన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. తనను గెలిపిస్తే ప్రజలకు సేవ చేస్తానన్నారు. ఓడిస్తే స్నేహితుడిగా ఉంటానని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల కాలంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో పతాక శీర్షికల్లో నిలుస్తున్నారు. మగాళ్లు పొరంబోకులు అని, అందుకే మహిళల పేరుతోనే ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుందని వ్యాఖ్యానించారు.
చంద్రబాబునాయుడు గెలిస్తే వాలంటీర్లపైనే తుపాకీ పెడతారని ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో వ్యాఖ్యానించారు. ఏ పార్టీకి ఓటేయాలో వాలంటీర్లు ఎందుకు చెప్పకూడదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు కంటే ముందే మనం తుపాకీని పేల్చాలని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తాను జగన్ కు చెప్పినట్టుగా ధర్మాన ప్రసాదరావు గత ఏడాది చివర్లో ప్రకటించారు. కానీ ఈ విషయంలో జగన్ ఒప్పుకోవడం లేదన్నారు.