వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి దేవినేని ఉమా. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలవరం ప్రాజెక్ట్ గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కడం చాలా సంతోషంగా ఉందని, 32 వేల 315.5 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేయడం గొప్ప విజయమని దేవనేని అభివర్ణించారు.

దేశమంతా గర్వపడి, తెలుగువాడి సత్తాను అభినందిస్తుంటే జగన్ ఓర్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. గిన్నిస్ రికార్డు పేరుతో నాటకం వేశామని తన అవినీతి పత్రిలో విషం చిమ్మడం, వేలాదిమంది కార్మికులు, ఇంజనీర్ల శ్రమను అవమానించడమేనని దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంచిని కూడా అంగీకరించలేని మానసిక వ్యాధితో జగన్ బాధపడుతున్నారని....చంద్రబాబును తిట్టకుండా, సీఎం సీటుపై కలలు కనకుండా జగన్‌కు ఒక్క రోజు కూడా గడవదన్నారు.  నిధులు ఉన్నా లేకున్నా ముఖ్యమంత్రి పోలవరం పనులను పరుగులు పెట్టిస్తున్నారని, కేంద్రం నిధులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నా జగన్ నోరు తెరవడం లేదని మండిపడ్డారు.

సీఎం కుర్చీ తప్పించి జగన్‌కు ఏదీ కనిపించడం లేదని, నిర్వాసితులకు డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా కేంద్రం నిధులు విడుదల చేయకున్నా, మోడీని, కేంద్రాన్ని ప్రతిపక్షనేత పల్లెత్తు మాట కూడా అనరని ఎద్దేవా చేశారు. అవినీతి కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న జగన్, విజయసాయిరెడ్డిలు చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటూ పుస్తకాలు వేసి దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

32 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ జగన్మోహన్ రెడ్డి కంటికి పూతలా కనిపించిందని ఫైరయ్యారు. తన స్వార్ధం కోసం గిన్నిస్ రికార్డును కూడా తప్పు పట్టేలా పిచ్చికథను రాయించారని దేవినేని దుయ్యబట్టారు. పట్టిసీమ లేకపోతే నేడు డెల్టా లేదు.. దానిని కూడా నువ్వు సమర్థించలేదని, కృష్ణా డెల్టాలో రెండు పంటలతో పాటు, రాయలసీమకు నీరు ఇచ్చి చూపామని ఉమ గుర్తుచేశారు.

రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు ముఖ్యమంత్రి తపన పడుతున్నారన్నారు. 10 వేల 449 కోట్ల రూపాయల పోలవరం పనులు చేస్తే 25 వేల కోట్ల అవినీతి జరిగిందని అసత్యాలను ప్రచారం చేస్తున్నారని దేవినేని విమర్శించారు.