అమరావతి:ఎన్నికల మీద నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, ఎంపీలను తక్షణం రాజీనామా చేయించి మళ్లీ ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలని మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్‌ విసిరారు.

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ చూస్తే ఆయనకు మతిస్థిమితం పూర్తిగా లేదని రూఢి అవుతోందని ఎద్దేవా చేశారు.ఎన్నికలు జరిగి 16 నెలలు మాత్రమే అవుతోంది. 16 నెలల క్రితం ఇదే ప్రజలు ఇచ్చింది అసలైన తీర్పు అని ఆయన చెప్పారు.

మేం విసురుతున్న ఈ సవాల్ ను చంద్రబాబు స్వీకరిస్తున్నాడా.. ? 48 గంటల్లోగా మేం విసురుతున్న ఈ సవాల్ కు చంద్రబాబు సమాధానం చెప్పాలి.  చంద్రబాబుకు తన మీద నమ్మకం ఉంటే.. ఈ సవాల్ ను స్వీకరించాలన్నారు. 

 రాజధాని ప్రజలు మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో ఇచ్చిన తీర్పు చంద్రబాబు రాజధాని డిజైన్ కు చెంపపెట్టు కాదా అని ఆయన ప్రశ్నించారు. గ్రాఫిక్స్ రాజధాని పేరిట చేసిన మోసాల్ని, తన బినామీల భూముల రేట్లు పెంచుకునేందుకు విభజించిన జోన్లను  చేసిన ల్యాండ్ పోలింగ్ దుర్మార్గాలని ఇదే రాజధాని ప్రజలు తిరస్కరించింది చంద్రబాబుకు తెలియదా..? అని ఆయన ప్రశ్నించారు. చివరికి ఆయన కొడుకుని కూడా తుక్కు తుక్కుగా ఓడించింది నిజం కాదా..? అని ఆయన అడిగారు.
 
 ఇక జగన్  రాజధాని విషయంలో మాట తప్పారని చంద్రబాబు అంటున్నారు. ఈరోజుకీ ఎక్కడ ఉన్నారండీ మీరు.. హైదరాబాద్ లోనే కదా..! జగన్  తాడేపల్లిలో అయితే.. గత ఆరు నెలలుగా బాబు ఉన్నది హైదరాబాద్ లో..కాబట్టి  అయ్యా, చంద్రబాబు..! మీరు ఏ రాజధాని గురించి ఎక్కడ నుంచి రంకెలు వేస్తున్నారో.. మీరే ఆలోచించుకోవాలని ఆయన సెటైర్లు వేశారు.

also read:అమరావతిపై టీడీపీ, వైసీపీ,జనసేన రాజీనామా సవాళ్లు: వేడేక్కిన ఏపీ రాజకీయాలు

డీసెంట్రలైజేషన్ ను  వ్యతిరేకించి చరిత్ర హీనులుగా మిగిలిపోయారన్నారు. ఇక విశాఖ వెళ్ళే హక్కు మీకు లేదు. ఉత్తరాంధ్రలో కాలు పెట్టే నైతికత మీకు లేదు. సొంత రాయలసీమలో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తుంటే దాన్నికూడా వ్యతిరేకించిన మీరు, సొంత మామకి మాత్రమే కాకుండా.. సొంత గడ్డకు కూడా వెన్నుపోటు పొడిచారన్నారు.

3 రాజధానులను వ్యతిరేకిస్తున్న మీరు ఈ మూడింటిలో అమరావతి కూడా ఉందని మరచిపోయారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నాం.. అంటున్న మీరు అమరావతిని కూడా వ్యతిరేకిస్తున్నారని ఇందుమూలంగా ప్రజలకు బాగా అర్థమవుతోందన్నారు.