నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వ్యక్తిత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంతం, పట్టింపు చాలా ఎక్కువ అన్నారు. అలాగే ఎంత మెుండోడినో అంతే మూర్ఖుడిని అంటూ చెప్పుకొచ్చారు. నా కుటుంబ సభ్యులు అందరిలోనూ తనకే ఎక్కువ పట్టుదల అని తెలిపారు.

నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గం దంతూరులో జరిగిన వైయస్ఆర్ రైతుదినోత్సవం కార్యక్రమలో పాల్గొన్న అనిల్ కుమార్ యాదవ్ తాను ఈ స్థాయిలో ఉండటానికి దంతూరు గ్రామం ఒకటని చెప్పుకొచ్చారు. 

నాలో కసిని కోపాన్ని పెంచింది ఈ గ్రామమేనని చెప్పుకొచ్చారు. రాజకీయంగా ఎదుగుదలకు కారణం ఈ గ్రామమేనని చెప్పుకొచ్చారు. ఇకపోతే రాజకీయాల్లో గానీ వ్యక్తిగతంగా గానీ ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటే అన్నీ సాధించేవాడినని చెప్పుకొచ్చారు. కాస్త ఆలస్యమైనా సాధించి తీరుతానన్నారు. 

కార్పొరేటర్ స్థాయి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే, ప్రస్తుతం మంత్రిగా అవకాశం వచ్చిందని ఇదంతా వైయస్ జగన్మోహన్ రెడ్డి చలవేనని చెప్పుకొచ్చారు. తనకు ఇంతకంటే గొప్ప కోరికలు ఆశలు ఏమీ లేవన్నారు. 

చనిపోయే వరకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు విధేయుడిగా పనిచేస్తానని తెలిపారు. చివరి రక్తం బొట్టు వరకు ఈ జీవితం జగన్ కే అంకితమన్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనితీరును పరుగులు పెట్టిస్తానని, తాగు, సాగునీటి సమస్యలను పరిష్కరిస్తానని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

గొడవలొస్తే పోలీస్ స్టేషన్ కు వెళ్లొద్దు, ఏడు నెలలు జైళ్లో ఉన్నా: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి