నెల్లూరు: ప్రతీ గ్రామంలో గొడవలు సహజంగానే ఉంటాయని అలాగని పోలీస్ స్టేషన్ కు వెళ్లొద్దని సూచించారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ప్రతీ చిన్న విషయానికి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకోవద్దని హితవు పలికారు. 
 
నెల్లూరు జిల్లా దంతూరు గ్రామంలో జరిగిన వైయస్ఆర్ రైతు దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దరిద్రం పడితే తప్ప ఎఫ్పుడో గానీ స్టేషన్ కు వెళ్లొద్దని హితవు పలికారు. గతంలో తాను కూడా వివిధ కేసుల్లో జైలు కెళ్లి వచ్చానని దాని ఫలితం తనకు తెలుసునన్నారు. 

23 కేసుల్లో 7 నెలలపాటు జైలులో ఉన్నానని దాని వల్ల ఎంత కోల్పోయానో తనకు తెలుసునన్నారు. గ్రామంలో రాజకీయ దాడులు తగ్గించుకోవాలని హితవు పలికారు. అందరం కలిసిమెలిసి ఉండాలని ఇక రాజకీయాల జోలికి వెళ్లొద్దన్నారు.  

ప్రతీ మనిషికి గొడవలు ఉండటం సహజమని అయితే వాటిని గ్రామంలోనే పరిష్కరించుకుంటే మంచిదని హితవు పలికారు. గ్రామపరిధి దాటి ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ కు వెళ్లారో అప్పుడే పతనం ప్రారంభమవుతుందన్నారు. తగాదాల పేరుతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కొద్దని సూచించారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.