నెల్లూరు: టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వర్షాలతో సుభిక్షంగా ఉంటే చంద్రబాబుకు ఏడుపు ఆగడం లేదని ఆయన శనివారం మీడియా సమావేశంలో అన్నారు. విజయవాడ కరకట్ట మీద ఉన్న ఇల్లు వరదలు వచ్చి మునుగుతుంటే చంద్రబాబు అక్కడే ఉంటానని అనడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు. 

కరకట్ట మీద ఉన్న ఇల్లు గురించి ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా చంద్రబాబు మొండికేస్తూ ప్రభుత్వంపై చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాష్ట్రానికి ఓ టూరిస్టు అని, టూరిస్టుల ఏపీకి వచ్చి సాయంత్రానికి ఫ్లయిట్ ఎక్కి పోయే ప్రతిపక్ష నేత అని ఆయన మండిపడ్డారు ఇలాంటి వ్యక్తికి మాట్లాడే అర్హత లేదని అన్నారు. 

బీసీల మీద మల్లీ చంద్రబాబుకు దొంగ ప్రేమ పుట్టుకొచ్చిందని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉంటే బీసీలు బిజినెస్ క్లాస్ ని, ప్రతిపక్షంలో ఉంటే బ్యాక్ వర్డ్ క్లాస్ అంటారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు దమ్ముంటే బీసీలకు ఏం చేశారో లెక్కలు తీయాలని ఆయన సవాల్ చేశారు. 

ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బీసీలకు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారో తాము చెబుతామని ఆయన అన్నారు. బీసీల గురించి చంద్రబాబు మాట్లాడడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు. పచ్చ పత్రికల్లో పిచ్చి రాతలు రాయించుకోవడం తప్ప చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడం కల్ల అని మంత్రి అన్నారు.