సినిమాల్లో కథానాయకుడు, రాజకీయాల్లో కంత్రీ: పవన్ పై అంబటి ఫైర్
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. రాజకీయాలకు పవన్ కళ్యాణ్ పనికిరాడన్నారు.
అమరావతి: సినిమాల్లో కథానాయకుడు, రాజకీయాల్లో కంత్రీ నాయకుడు అంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. రాజకీయాల్లో చంద్రబాబుకు డబ్బింగ్ చెప్పే స్థాయికి పవన్ కళ్యాణ్ దిగజారాడని ఆయన ఎద్దేవా చేశారు.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం వైఎస్ జగన్ పై చేసిన విమర్శలకు ఏపీ మంత్రి అంబటి రాంబాబు కౌంటరిచ్చారు. గురువారంనాడు ఏపీ మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లిలో మీడియాతో మాట్లాడారు. వారాహి అంటే అమ్మవారి పేరు అని అంబటి రాంబాబు చెప్పారు. అమ్మవారి పేరు పెట్టుకున్న వాహనంపై ఎక్కి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్నారన్నారు. వారాహిని వాహనంగా చేసుకోవడం తప్పన్నారు. వారాహిపై ప్రయాణం చేస్తే చాలా అనర్ధాలకు దారితీస్తుందని గతంలోనే తాను చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
also read:వరాహికి, వారాహికి తేడా తెలియదా.. ‘‘అ,ఆ’’లు సరిగ్గా నేర్చుకోకుంటే ఇంతే : జగన్‌కు పవన్ కౌంటర్
పవన్ కళ్యాణ్ ఎక్కిన తర్వాత వారాహి కాస్తా వరాహి అయిందని అంబటి రాంబాబు చెప్పారు. వారాహి వాహనంపై ఊగిపోతూ పవన్ కళ్యాణ్ బూతులు తిడుతున్నారన్నారు. వారాహిపై ఎక్కి పూనకం వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. పవన్ కళ్యాణ్ చేసే ప్రతి వెనుక ఓ కథ ఉంటుందని ఆయన సెటైర్లు వేశారు.ఏపీలో జగన్ సీఎంగా లేకపోతే పేదలకు ప్రస్తుతం అందుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందవని ఆయన చెప్పారు. ఎన్నికల వరకు చలో ఏపీ, ఎన్నికలయ్యాక చలో హైద్రాబాద్ అంటూ పవన్ కళ్యాణ్ పై అంబటి రాంబాబు విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు ఏపీ గుర్తుకు వస్తుందన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విపక్షాలపై అంబటి రాంబాబు విమర్శించారు.స్థిరత్వం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. ఆయనను నమ్ముకొని రాజకీయాలు చేస్తే నష్టపోతారన్నారు.