రాయలసీమ అభివృద్ధి, ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. తన మామను ముంచినట్లుగా ప్రాజెక్టులను సైతం ముంచారంటూ మంత్రి దుయ్యబట్టారు.
రాయలసీమ అభివృద్ధి, ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రోజూ గంట సేపు ఉపన్యాసం ఇవ్వాలని అనుకుంటున్నట్లు ఉన్నారంటూ సెటైర్లు వేశారు. జగన్‌ను రాయలసీమ ద్రోహి అని చూపించాలనే ప్రయత్నిస్తున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో నుండి దింపకపోతే చంద్రబాబు రాయలసీమను రత్నాల సీమగా మార్చే వాడట అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని.. వైసీపీపై బురద జల్లి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.
వ్యవసాయం, ఇరిగేషన్, రాయలసీమ గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని రాంబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో 300 కరువు మండలాలుగా ప్రకటించారని ఆయన గుర్తుచేశారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క మండలాన్నీ కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదని మంత్రి వెల్లడించారు. జగన్ పాదం ప్రభావం అలాంటిదని రాంబాబు పేర్కొన్నారు. చంద్రబాబు హైదరాబాద్‌లో ఓటుకు నోటు కేసులో దొరికిపోయాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి వంటి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్‌కు భయపడ్డారని రాంబాబు ఎద్దేవా చేశారు.
ALso Read: బాహుబలిలో కుంతల రాజ్యం .. ఏపీలో గుంతల రాజ్యం : వైఎస్ జగన్‌పై నారా లోకేష్ సెటైర్లు
ప్రాజెక్టులకు సంబంధించిన 198 పనులను ప్రీ క్లోజ్ చేశామని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఆ పనుల పూర్తికి కాంట్రాక్టర్‌లు రాకపోవడంతో ప్రీ క్లోజ్ చేశామని అంబటి రాంబాబు క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు పోలవరానికి చేసిన రూ. 10,540 కోట్లు ఖర్చును మొత్తం వ్యయంలో కలిపారని మంత్రి అన్నారు. నీరు- చెట్టుకు 13 వేల కోట్ల రూపాయలను ఖర్చు పేరుతో దోచుకున్నారని రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు ఖర్చు పెట్టాం అనే పదానికి బదులు తిన్నాం అని పెట్టుకుంటే సరిగ్గా సరిపోతుందని మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పట్టిసీమ కూడా ప్రాజెక్టు అని చెబుతున్నారని.. పట్టిసీమను ఒకటి, రెండు రోజుల మినహా ఉపయోగించాల్సిన అవసరమే రాలేదని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఈ పట్టిసీమ కోసం రూ.2,047 కోట్లు ఖర్చు పెట్టాడని ఆయన దుయ్యబట్టారు. అంతేకాదు ముందస్తుగా పూర్తి చేశాడని రూ. 257 కోట్లను కాంట్రాక్టర్ కు బహుమతిగా ఇచ్చాడని రాంబాబు ఆరోపించారు. అంటే ఈ రూ. 257 కోట్లను చంద్రబాబు గుటకాయ స్వాహా చేశాడని పేర్కొన్నారు.
పురుషోత్తం ప్రాజెక్టుకు అనుమతులే లేవని , కానీ అశాస్త్రీయంగా రూ.1600 కోట్లు వృథా చేశారని అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా? అని ఆయన నిలదీశారు. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఎన్నో ప్రాజెక్టులకు డిజైన్ చేస్తే, ఆయన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. తన మామను ముంచినట్లుగా ప్రాజెక్టులను సైతం ముంచారంటూ మంత్రి దుయ్యబట్టారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అన్ని ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించారని రాంబాబు పేర్కొన్నారు.
