విశాఖపట్టణంలోని యూనివర్శల్ సృష్టి ఆసుపత్రి ఎండీ డాక్టర్ నమ్రత వైద్య డిగ్రీని తక్షణమే సస్పెండ్ చేయాలని మెడికల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకొంది. ఈ తరహా కేసులను ఉపేక్షించేది లేదని మెడికల్ కౌన్సిల్ ప్రకటించింది.
విశాఖపట్టణం: విశాఖపట్టణంలోని యూనివర్శల్ సృష్టి ఆసుపత్రి ఎండీ డాక్టర్ నమ్రత వైద్య డిగ్రీని తక్షణమే సస్పెండ్ చేయాలని మెడికల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకొంది. ఈ తరహా కేసులను ఉపేక్షించేది లేదని మెడికల్ కౌన్సిల్ ప్రకటించింది.ఈ విషయమై లోతుగా దర్యాప్తు చేసి తదుపరి చర్యలు తీసుకొంటామని ఏపీ మెడికల్ కౌన్సిల్ ఛైర్మెన్ డాక్టర్ సాంబశివారెడ్డి ప్రకటించారు.
అక్రమంగా పసిపిల్లలను విక్రయించారని డాక్టర్ నమ్రతపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ కేసులో ఆమె ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉంది. ఇవాళ్టితో ఆమె కస్టడీ పూర్తి కానుంది. కస్టడీ పూర్తైతే ఆమెను తిరిగి జైలుకు తరలించనున్నారు.
ఈ కేసును ఏపీ మెడికల్ కౌన్సిల్ సుమోటోగా స్వీకరించింది.పసిపిల్లలను అక్రమ రవాణా కేసులో డాక్టర్ నమ్రతతో పాటు మరికొన్ని ఆసుపత్రులపై కూడ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.
also read:సృష్టి ఆసుపత్రితో పద్మజ ఆసుపత్రి లింకులు?: పోలీసుల సోదాలు, డాక్యుమెంట్ల స్వాధీనం
సంతానం కావాలని హాస్పిటల్‌కు వచ్చిన 63 మందితో సరగోసి పద్ధతిలో పిల్లల్ని సమకూర్చేందుకు డా.నమ్రత ఒప్పందం కుదుర్చుకుందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పద్మజ హాస్పటల్‌కు చెందిన డాక్టర్ పద్మజతో కలసి నేరాలకు పాల్పడినట్లు తెలిసిందని నగర పోలీస్ కమిషనర్ ఆర్.కె.మీనా తెలిపారు.
ఈ కేసులో డాక్టర్ తిరుమల, రామకృష్ణ, కోడె వెంకటలక్ష్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం డాక్టర్ పద్మజతో పాటు ఏజెంటుగా వ్యవహరించిన ఎన్.నూకరత్నంను అదుపులోకి తీసుకున్నారు.
