ఏపీ శాసనమండలిలో టీడీపీ సభ్యుల ఆందోళన,గందరగోళం: వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో కూడ టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. చంద్రబాబు అరెస్ట్ పై వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో శాసనమండలిని వాయిదా వేశారు చైర్మెన్.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసమండలిలో టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. చంద్రబాబునాయుడు అరెస్ట్ పై టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే ఈ వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే ఈ తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టుగా చైర్మెన్ మోషేన్ రాజు ప్రకటించారు.దీంతో శాసనమండలి చైర్మెన్ పోడియం వద్ద టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి గురువారంనాడు ప్రారంభమైంది. శాసనమండలి సమావేశాలు ప్రారంభమైన వెంటనే తమ వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ సభ్యులు కోరారు. అయితే ఈ తీర్మానాన్ని తిరస్కరించినట్టుగా చైర్మెన్ ప్రకటించారు.వెంటనే ప్రశ్నోత్తరాలను చేపట్టారు. దీంతో టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. టీడీపీ సభ్యుల నిరసనల మధ్యే ప్రశ్నోత్తరాలను కొనసాగించారు చైర్మెన్ . చైర్మెన్ పోడియం వద్ద టీడీపీ సభ్యుల నిరసనలపై అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏపీ శాసనమండలి చైర్మెన్ టీడీపీ సభ్యులను తమ స్థానాల్లో కూర్చోవాలని కోరారు. అయినా కూడ టీడీపీ సభ్యులు తమ నిరసనను కొనసాగించారు.ఈ సమయంలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకున్నారు. సభా సమయాన్ని వృధా చేయడం సరైంది కాదని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. సభా వాయిదా వేసి చంద్రబాబు అరెస్ట్ పై చర్చకు సమయం కేటాయించాలని ఆయన చైర్మెన్ ను కోరారు. మరో రూపంలో చర్చకు రావాలని టీడీపీ సభ్యులకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. అన్ని విషయాలపై చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామని బొత్స సత్యనారాయణ చెప్పారు. టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో ఏపీ శాసనమండలిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఏపీ శాసనమండలిని వాయిదా వేశారు చైర్మెన్ మోషేన్ రాజు.
also read:ప్రతిపక్షం హింసను కోరుకుంటుంది: పేర్నినాని, కౌంటరిచ్చిన బుచ్చయ్య చౌదరి
అంతకు ముందు ఏపీ అసెంబ్లీలోనూ కూడ ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. టీడీపీ, వైసీపీ సభ్యులు పోటా పోటీ నిరసనలకు దిగారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయ. దీంతో ఏపీ అసెంబ్లీని స్పీకర్ తమ్మినేని సీతారాం వాయిదా వేశారు.