ప్రతిపక్షం హింసను కోరుకుంటుంది: పేర్నినాని, కౌంటరిచ్చిన బుచ్చయ్య చౌదరి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత మాజీ మంత్రి పేర్ని నాని, టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది.
అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత అసెంబ్లీ లాబీల్లోని టీడీఎల్పీ కార్యాలయం వద్ద టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి పేర్నినాని మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.
టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అరెస్ట్ పై టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.ఈ తీర్మానంపై చర్చకు గురువారంనాడు అసెంబ్లీలో టీడీపీ సభ్యులు పట్టుబట్టారు.దీంతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీని స్పీకర్ వాయిదా వేశారు. అసెంబ్లీ వాయిదా పడడంతో టీడీఎల్పీ కార్యాలయం వద్ద గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి పేర్నినాని ఒకరికొకరు తారసపడ్డారు. ఇద్దరి మధ్య అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై చర్చ జరిగింది.
ప్రతిపక్షం హింసను కోరుకుంటుందని మాజీ మంత్రి పేర్నినాని ఆరోపించారు. ఏపీ అసెంబ్లీలో ఇవాళ చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మనసు చంపుకొని రాజకీయం కోసం పనిచేస్తున్నారని పేర్ని నాని చెప్పారు.మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కౌంటరిచ్చారు. రాజకీయం కోసం కాదు, రాజ్యాంగం కోసం తాను పనిచేస్తున్నానని బుచ్చయ్య చౌదరి చెప్పారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిమాణాలను మాజీ మంత్రి పేర్నినాని అసెంబ్లీ లాబీల్లో మీడియాకు వివరించారు.ప్రస్తుతం కేంద్రం తీరు చూస్తుంటే ఇవే అఖరి సెషన్స్ లా ఉన్నాయని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. ఈ ఏడాది డిసెంబర్ లోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందేమోనన్నారు.అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయ్యాకే ఎన్నికలు జరిగే అవకాశం ఉండే అవకాశం లేకపోలేదని పేర్నినాని చెప్పారు.
also read:ఏపీ అసెంబ్లీలో గందరగోళం, దండం పెట్టిన స్పీకర్: వాయిదా
ఇవాళ ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే అసెంబ్లీలో టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. చంద్రబాబు అరెస్ట్ పై తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు.ఈ నిరసనలకు వైసీపీ ఎమ్మెల్యేలు కూడ కౌంటర్ గా నిరసనలు చేపట్టారు. ఇదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మీసం తిప్పడంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. బాలకృష్ణకు వైసీపీకి చెందిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తొడగొట్టి బాలకృష్ణకు మధుసూధన్ రెడ్డి సవాల్ విసిరారు. రెండు పార్టీల ఎమ్మెల్యేలు పోటాపోటీగా నిరసనలకు దిగారు. దీంతో సభలో ఉద్రిక్తత నెలకొంది.ఈ పరిణామాలతో స్పీకర్ తమ్మినేని సీతారాం లేచి నిలబడి దండం పెట్టారు. అయినా సభలో గందరగోళ పరిస్థితులు తగ్గలేదు. దీంతో సభను వాయిదా వేస్తున్నట్టుగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.