Asianet News TeluguAsianet News Telugu

నిమ్మగడ్డ పిటిషన్ మీద విచారణ: సీఐడి కేసుపై హైకోర్టు స్టే

ఏపీ హైకోర్టులో ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ మీద సీఐడి పెట్టిన కేసుపై ఏపీ హైకోర్టు స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

AP High Court stay on CID Csae against AP Election Commisssion
Author
Amaravathi, First Published Sep 7, 2020, 1:27 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషన్ మీద సీఐడి అధికారులు నమోదు చేసిన కేసుపై హైకోర్టు స్టే విదించింది. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఊరట లభించింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేంతవరకు ఈ కేసులో తదుపరి చర్యలు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమీషన్ తరపున హైకోర్టులో న్యాయవాదులు సీతారామమూర్తి, అశ్విన్ కుమార్ వాదనలు వినిపించారు.

ఎన్నికల సంఘం విధుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈసీ నుంచి సీఐడి అధికారులు తీసుకుని వెళ్లిన వస్తువులను తిరిగి అప్పగించాలని ఆదేశాలు ఇవ్వాలని ఆయన హైకోర్టును కోరారు. హోం శాఖ కార్యదర్శిని, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిని, సిఐడిని, డీజీపీని, తదితరులను తన పిటిషన్ లో రమేష్ కుమార్ ప్రతివాదులుగా చేర్చారు. 

ఎస్ఈసీ స్వతంత్రను దెబ్బ తీసే విధంగా ప్రభుత్వం పావులు కదుపుతోందని రమేష్ కుమార్ అన్నారు. తమ సిబ్బందిపై సీఐడి నమోదు చేసిన కేసును రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని, ఈ వ్యవహారంపై సిబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని ఆయన కోరారు. ఎస్ఈసీ సహాయ కార్యదర్శి సాంబమూర్తి వాడిన కంప్యూటర్ ను, అందులోని డేటాను సిఐడి అధికారులు తీసుకుని వెళ్లారని ఆయన ఆరోపించారు. 

గతంలో తాను కేంద్రానికి రాసిన లేఖ వ్యవహారాన్ని తెలుసుకునేందుకు వచ్చిన సిఐడి అధికారులు ఆ విషయాన్ని పక్కన పెట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపారని ఆయన ఆరోపించారు.పనిచేయని కంప్యూటర్ ను ఫార్మాట్ చేసినందుకు సాంబమూర్తిని సిఐడి అధికారులు వేధించడమే కాకుండా సాక్ష్యాలను ధ్వంసం చేశారని ఆయనపై తప్పు కేసు బనాయించారని రమేష్ కుమార్ అన్నారు. 

ఎన్నికల సిబ్బందిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఎన్నికల సంఘం సహాయ కార్యదర్శి సాంబమూర్తి హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. తనపై సిఐడి నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

ఆర్డినెన్స్ ను జారీ చేసి గతంలో జగన్ ప్రభుత్వం ఈసీ పదవి నుంచి రమేష్ కుమార్ ను తొలగించిన విషయం తెలిసిందే. అయితే, హైకోర్టు ఆర్డినెన్స్ ను కొట్టివేసింది. దాంతో కోర్టుల ద్వారా ఆదేశాలు పొంది రమేష్ కుమార్ ఈసీ పదవిని చేపట్టారు. ఈసీ పదవిని చేపట్టిన తర్వాత తాజాగా హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios