న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై దాఖలైన పిటిషన్లను విచారించిన ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సోషల్ మీడియాలో కేసుల విచారణను సీబీఐ లేదా ఎన్ఐఏకు ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించింది.

ప్రజాస్వామ్యం నిలబడాలంటే కోర్టులు అవసరమన్న ధర్మాసనం.. న్యాయస్థానాలు, ప్రభుత్వం, అధికారులు కలిసి పనిచేసుకోవాలని వ్యాఖ్యానించింది. జ్యూడిషియరీ మీద ఎలాంటి అటాక్ చేయడం సరికాదంది.

హైకోర్టు తీర్పులపై అసహనం వుంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలని సూచించింది. స్పీకర్ తమ్మినేని రాజ్యాంగ పదవిలో వుండి, హైకోర్టు వంటి రాజ్యాంగ బద్ధ సంస్థలపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేసింది.

స్పీకర్ తమ్మినేని, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగం సురేశ్ వ్యాఖ్యలపై ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే అరెస్ట్‌లు చేస్తున్నారని లాయర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు.