అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మతంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాకింగ్ ప్రశ్న వేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలోకి అన్యమతస్తులు వెళ్లేటప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని, కానీ అన్యమతస్థుడైన ఏపీ సీఎం వైఎస్ జగన్ అందుకు విరుద్ధంగా వ్యవహరించారని పిటిషనర్ చేసిన వాదనతో ఏపీ హైకోర్టు విభేదించింది. 

జగన్ హిందువు కాదని, క్రైస్టవుడని ఏ ఆధారంతో చెబుతారని హైకోర్టు ప్రశ్నించింది. అలాంటి ఆధారాలు ఉంటే తమ ముందు ఉంచాలని హైకోర్టు పిటిషనర్ ను ఆదేశించింది. ఆధారాలు లేకుండా సీఎం మతం గురించి మాట్లాడడం సరి కాదని హెచ్చరించింది. తగిన ఆధారాలు ఉంటేనే తదుపరి విచారణ కొనసాగిస్తామని తేల్చి చెప్పింది. 

పిటిషన్ లో గవర్నర్ ను ప్రతివాదిగా ప్రస్తావించడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. దాన్ని సూమోటోగా తొలగిస్తున్నట్లుర తెలిపింది. గవర్నర్ ను ప్రతివాదిగా పేర్కొన్నప్పటికీ ఆ పిటిషన్ కు ఎలా నంబర్ కేటాయించారంటూ రిజిస్ట్రీని పిలిపించి హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.  తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఆ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఆ మధ్య తిరుమల వెళ్లిన వైఎస్ జగన్ శ్రీవారి దర్శనానికి ముందు డిక్లరేషన్ ఇవ్వలేదని, ఇది దేవాదాయ చట్టానికి విరద్ధమని అంటూ గుంటూరు జిల్లా వైకుంఠాపురానికి చెందిన సుధాకర్ బాబు హైకోర్టులో కో- వారెంటో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై హైకోర్టు విచారణ జరిపింది.