అమరావతి: పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దుపై  విచారణను ఏపీ హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీకి వాయిదా వేసింది.  ఈ కేసు విచారణపై ఆసక్తితో వైసీపీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి, విజయవాడ ఎంపీ, టీడీపీ నేత కేశినేని నానితో పాటు పలువురు రైతులు కూడ గురువారం నాడు హైకోర్టుకు  హాజరయ్యారు.

Also read:అందుకే శాసన మండలి రద్దు ఆలోచన: బొత్స సంచలనం

గురువారం నాడు మధ్యాహ్నం ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ సాగించింది.  పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు మనీ బిల్లులు అంటూ పిటిషనర్ తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈ రెండు బిల్లులు మనీ బిల్లులు కావని  రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది  వాదించారు. ఈ రెండు బిల్లులను శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపిన విషయాన్ని అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

రాజధానిపై హైకోర్టులో దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి  ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీన విచారణ చేయనున్నట్టుగా హైకోర్టు ప్రకటించింది.  అయితే ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించే ఏర్పాట్లు సాగుతున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. 

ఒకవేళ అదే జరిగితే అధికారులను బాధ్యులను చేస్తామని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది.  మండలిలో బిల్లు ఆమోదం పొందనందున ఈ కేసు విచారణ ఇప్పటికిప్పుడే చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయాన్ని హైకోర్టు వ్యక్తం చేసింది..రాజధానితో పాటు ఈ బిల్లులపై అన్ని పిటిషన్లను ఫిబ్రవరి 26వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.