రాజధాని కేసుల విచారణను జనవరి 28కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు..
ఏపీ రాజధాని కేసుల విచారణను హైకోర్టు (AP High Court) వాయిదా వేసింది. విచారణను జనవరి 28వ తేదీకి వాయిదా వేస్తున్నట్టుగా హైకోర్టు ధర్మాసనం తెలిపింది. ఆ రోజు ఈ కేసులపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని తెలిపింది.
ఏపీ రాజధాని కేసుల విచారణను హైకోర్టు (AP High Court) వాయిదా వేసింది. విచారణను జనవరి 28వ తేదీకి వాయిదా వేస్తున్నట్టుగా హైకోర్టు ధర్మాసనం తెలిపింది. నేడు రాజధాని కేసుల విచారణ సందర్భంగా.. విచారణను జనవరి 31కి వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ న్యాస్థానాన్ని కోరారు. మరోవైపు రైతులు తరఫున సుప్రీం కోర్టు లాయర్ శ్యామ్ దివాన్ హైకోర్టులో వాదనలు వినిపించారు. పిటిషన్లపై విచారణ చేపట్టాలని కోరారు. మాస్టర్ అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని అడిగారు.
అయితే వీటిపై స్పందించిన హైకోర్టు ధర్మాసనం.. సీఆర్‌డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో పిటిషన్లలో ఇంకా కొనసాగాల్సిన అంశాలు ఏమున్నాయనే వివరాలను 10 రోజుల్లోగా నోట్ దాఖలు చేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులను హైకోర్టు ఆదేశించింది. రైతుల దాఖలు చేసే నోట్‌పై స్పందన తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం తరఫున అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రాజధాని కేసుల విచారణను హైకోర్టు జనవరి 28కి వాయిదా వేసింది. ఆ రోజు ఈ కేసులపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని తెలిపింది.
ఇక, మూడు రాజధానుల (three capitals) చట్టంతో పాటు సీఆర్డిఏ రద్దు చట్టాన్ని కూడా నవంబర్ 22న ఉపసంహరించుకొన్నట్టుగా హైకోర్టుకు తెలుపుతూ ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అఫిడవిట్ కూడా దాఖలుచేసింది. చట్ట సభలో ప్రవేశపెట్టిన రద్దు బిల్లులకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలిపారని... దీంతో ఆ బిల్లులు చట్టరూపం దాల్చాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకి నివేదించింది.
ఇప్పటికే అమరావతి (amaravati) రాజధాని ప్రాంతంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టినట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కృష్ణా రైట్ ఫ్లడ్ బ్యాంక్ బండ్ విస్తరణ, బలోపేతం ప్రాజెక్టును చేపట్టామని... ఇందుకోసం రూ.150 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం వివరించింది. పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, హైకోర్టు అదనపు భవనాన్ని నిర్మిస్తున్నామంటూ ప్రభుత్వం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది.