అమరావతి: దురుద్దేశ్యంతోనే రాజధానిని అమరావతి నుండి తరలిస్తున్నారని రాజధాని రైతులు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై రైతుల తరపున హైకోర్టులో న్యాయవాది ఉన్నం మురళీధర్  వాదించారు. ఈ కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్ తో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి హైకోర్టు  గురువారం నాడు నోటీసులు జారీ చేసింది.

పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ చట్టం రద్దుపై స్టేటస్ కో ను ఈ ఏడాది సెప్టెంబర్ 21వ తేదీ వరకు పొడిగిస్గున్నట్టుగా ఏపీ హైకోర్టు గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ చట్టాలను సవాల్ చేస్తూ  దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ చేసింది.ఈ విషయమై ఏపీ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ఒక్క కౌంటర్ మాత్రమే ప్రభుత్వం దాఖలు చేయడంపై ఏపీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.  ప్రతి ఒక్క పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

విశాఖపట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం అతిథి గృహన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారని ఢిల్లీకి చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది నితీష్ గుప్తా కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.  ఎగ్జిక్యూటివ్ రాజధానిని విశాఖపట్టణంలో ఏర్పాటు చేసే ఉద్దేశ్యంతోనే  ఈ నిర్మాణం చేపడుతున్నారని ఆయన ఆ పిటిషన్ లో ఆరోపించారు. 

also read:మూడు రాజధానులు: జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఈ పిటిషన్ పై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. 30 ఎకరాల్లో అతిథిగృహం నిర్మించే విషయంలో రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంతకంతో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై సెప్టెంబర్ 10వ తేదీలోపుగా కౌంటర్ దాఖలు చేయాలని సీఎస్ ను ఏపీ హైకోర్టు ఆదేశించింది.

అమరావతి రైతుల తరుపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీలు వాదించారు. ఈ కేసు విచారణను త్వరగా పూర్తి చేయాలని ఈ నెల 26వ తేదీన సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టును ఆదేశించింది. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ 21 నుండి రోజూ వారీ విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది.అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాలా... ప్రత్యక్షంగా నిర్వహించాలా అనేది నిర్ణయిస్తామని హైకోర్టు తెలిపింది.