అమరావతి: పంచాయితీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ నెల 17 వరకు మీడియాతో మాట్లాడొద్దని పెడన వైసీపీ ఎమ్మెల్యే  జోగి రమేష్ కు ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఎస్ఈసీ ఆదేశాలపై ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.  ఈ పిటిషన్‍పై విచారణ జరిపిన న్యాయస్థానం జోగి రమేష్ కు ఊరటనిచ్చింది. 

అయితే ఎస్ఈసీని, ఎన్నికల ప్రక్రియను కించపర్చేలా మాట్లాడవద్దని హైకోర్టు జోగి రమేష్ ను ఆదేశించింది. కానీ ప్రభుత్వ పథకాలపై మీడియాతో మాట్లాడవచ్చని...ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో మాట్లాడవద్దని జోగి రమేశ్‍ ను హైకోర్టు ఆదేశించింది. ఇటీవల చేసిన వ్యాఖ్యలపై జోగి రమేష్‍కు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని ఎస్ఈసీకి హైకోర్టు ఆదేశించింది. 

read more   నిమ్మగడ్డకు షాక్: ఇంటి అద్దె అలవెన్స్ మీద విచారణకు గవర్నర్ ఆదేశం
   
పెడనలో జరిగిన ఓ సమావేశంలో ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ వైసీపీ బలపరిచిన అభ్యర్థికి ఎదురు ఎవరు పోటీకి దిగినా... వారికి ప్రభుత్వ పథకాలు కట్ చేస్తానని హెచ్చరించారు.  దీనిపై మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. జోగి రమేష్ మాట్లాడిన వీడియో ఆధారాలు ఉండడంతో ఎస్ఈసీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎస్ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది.

కాగా జోగి రమేష్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ''ఎవరైనా వేరే పార్టీ తరఫున వార్డు సభ్యునిగా నిలబడితే వాళ్ల ఇంట్లో వాళ్లకు ప్రభుత్వ పతకాలు కట్ చేస్తా.. జగనన్న పథకాలు తీసుకుంటూ, వ్యతిరేకంగా నిలబడితే వాళ్ల ఇంట్లో ఉన్న పింఛన్‌, కాపునేస్తం, అమ్మఒడి ప్రతి ఒక్కటీ కట్ చేసి పడేస్తా. సమస్యే లేదు. మొహమాటం కూడా లేదు..'' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఎస్‌ఈసీ ఈ మేరకు చర్యలు తీసుకుంది.