అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో రాష్ట్ర ఎన్నికల సంఘానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాల్లో అవకతవకలు జరిగాయంటూ వాటిపై నిర్ణయం తీసుకోకుండా పరిశీలనలో పెట్టింది ఈసీ. అయితే ఈ ఏకగ్రీవాలపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ(మంగళవారం) విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే ఎస్ఈసీ నిర్ణయాన్ని తప్పుబట్టిన న్యాయస్థానం ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీలను తక్షణమే అధికారికంగా ప్రకటించాలని ఆదేశించింది. 

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ఎస్ఈసీ జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. ఈ ఏకగ్రీవాలపై దర్యాప్తు చేసే అధికారం ఎస్‌ఈసీకి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. వెంటనే ఏకగ్రీవంగా ఎన్నికయిన అభ్యర్ధులకు డిక్లరేషన్‌ ఇవ్వాలని న్యాయస్థానం ఎస్ఈసీకి ఆదేశాలు జారీ చేసింది.  

 ఔత్సాహికులు ఎన్నికల్లో పాల్గొనాలని ముందుకు వస్తే.. వారికి అండగా నిలబడాల్సిన అవసరం వ్యవస్థకు వుందని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గతంలో పేర్కొన్నారు. ఎన్నికలకు ఆటంకం కలిగిస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని నిమ్మగడ్డ హెచ్చరించారు. ఏకగ్రీవాలు జరిగినా వాటిని పరిశీలించాల్సిందిగా అధికారులను కోరామని నిమ్మగడ్డ వెల్లడించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలపై కమీషన్ విచారణ జరుగుతుందని నిమ్మగడ్డ ప్రకటించారు. ఈ నిర్ణయంపైనే హైకోర్టులో పిటిషన్ దాఖలవగా ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం ఆ ఉత్తర్వులను కొట్టేసింది.