రాజధాని గ్రామాల్లో మహిళలు, రైతులు పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పందించింది. పోలీసుల వైఖరిపై వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటాగా స్వీకరించింది. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాల్సిందిగా హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రమాణ పత్రం జారీ చేయాలని ఏజీని ఆదేశిస్తూ, తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. 

Also Read:అమరావతి మహిళలపై పోలీసుల దాడి... జాతీయ మహిళా కమీషన్ సీరియస్

ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని ఆ ప్రాంత ప్రజలు చేపట్టిన నిరసనలు జాతీయ మహిళా కమీషన్ దృష్టికి వెళ్లాయి. నిరసనల్లో పాల్గొన్న మహిళలపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై మహిళా కమీషన్ స్పందించింది. తుళ్లూరు మహిళల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించడమే కాదు దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ  ట్విట్టర్ ద్వారా స్పందించారు.

శనివారం అమరావతికి జాతీయ మహిళా కమిషన్ నిజ నిర్ధారణ కమిటీని పంపనున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కమిటీసభ్యులు నిజానిజాలు  తెలుసుకుని తమకు నివేదిక అందించనున్నట్లు తెలిపారు. దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. 

శుక్రవారం నిరసన కార్యక్రమాల్లో భాగంగా తుళ్లూరుకు చెందిన మహిళలు పాదయాత్రగా రాజధాని శంఖుస్థాపన ప్రాంతానికి వెళ్లారు. అయితే నిరసనల నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో ఆంక్షలు విధించిన పోలీసులు శంకుస్థాపన ప్రాంతానికి వెళ్లకముందే మహిళల ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు,  మహిళల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్తతకు దారితీసింది. 

Also Read:Video: అమరావతి మహిళలపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టింగ్ లు... పోలీసులకు ఫిర్యాదు

పోలీసులు ఏర్పాటుచేసిన పెన్సింగ్ ను సైతం దాటుకుని మహిళలు, రైతులు ముందుకు వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో పరిస్థితి అదుపుతప్పుతోందని భావించిన పోలీసులు నిరసనకారులపై లాఠీఛార్జ్ చేశారు. పోలీసులకు, గ్రామస్తులకు మధ్య సాగిన ఈ ఘటనతో తుళ్లూరులో యుద్దవాతావరణం నెలకొంది.