అమరావతి: రాష్ట్రంలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల్లో వైసిపి అధికార అండతో అవకతవకలకు పాల్పడి తమ అభ్యర్ధులను గెలిపించుకుంటోందని ప్రదాన ప్రతిపక్షం టిడిపితో పాటు ఇతరపార్టీలూ ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టే కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టాలంటే హై కోర్టులో ఓ పిటిషన్ దాఖలయ్యింది. దీనిపై ఇవాళ(మంగళవారం) న్యాయస్థానం విచారణ జరిపింది. 

ఇప్పటికే ఎస్ఈసి సిసి కెమెరాల ఏర్పాటుపై రాసిన లేఖను ప్రభుత్వం అమలుచేసేలా చూడాలని పిటీషనర్ పేర్కొన్నారు. అయితే కేవలం సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలలో సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో సమస్యాత్మక ప్రాంతాల వివరాలు ఇవ్వాలని హై కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. 

read more  సీఎం సొంత జిల్లాలో మహిళా అభ్యర్థుల పరిస్థితి ఇదీ..: ఎస్ఈసీకి చంద్రబాబు లేఖ

పంచాయితీ ఎన్నికలు ఏకపక్షంగా, ప్రజాస్వామ్య విరుద్దంగా జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. సరైన పద్దతిలో ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదనే భయం వైఎస్ఆర్‌సీపీలో కన్పిస్తోందని... అందువల్లే పోలీస్, రెవిన్యూ, పంచాయితీరాజ్ శాఖ అధికారులు, ఉద్యోగులను ఉపయోగించుకుని గెలవాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు. మరీముఖ్యంగా ఓట్ల లెక్కింపు సమయంలో అవకతవకలకు పాల్పడి ఫలితాన్నే మార్చేస్తున్నారన్నారు. అందువల్లే ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో సిసి కెమెరాలు ఏర్పాటుచేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.