సినీ నిర్మాత అశ్వినీదత్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు మంగళవారం విచారించింది. గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణకు భూములిచ్చిన అశ్వినీదత్.. తనకు నష్టపరిహారం చెల్లించాలని కోర్టును ఆశ్రయించారు.

అయితే ఆయనకు గత టీడీపీ ప్రభుత్వం అమరావతిలో ఫ్లాట్ ఇచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం కాంట్రాక్ట్ నుంచి వైదొలిగి.. తమకు నష్టం చేకూర్చిందని అశ్వినీదత్ దంపతులు న్యాయస్థానానికి తెలియజేశారు.

అంతేకాకుండా ఏడాదిగా భూమి లీజ్ కూడా చెల్లించలేని అశ్వినీదత్ తరపున లాయర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం కౌంటర్లు దాఖలు చేయాలని రెవెన్యూ, మున్సిపల్, సీఆర్‌డీఏని కోర్టు ఆదేశించింది. అలాగే తదుపరి విచారణను నవంబర్ 3కి వాయిదా వేసింది.

గతంలో గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం 40 ఎకరాల భూమిని అశ్వినీదత్ ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రభుత్వ ఒప్పందం ప్రకారం భూసేకరణ కాకుండా.. భూ సమీకరణ కింద అశ్వినీదత్ భూమిని ఇచ్చారు. అశ్వినీదత్ భూసమీకరణ కింద ఇచ్చిన భూమికి బదులుగా సీఆర్డీయే పరిధిలో ఆయనకు గత ప్రభుత్వం భూమిని కేటాయించింది.

అయితే సీఆర్డీఏ పరిధి నుంచి రాజధాని ఏపీ ప్రభుత్వం తప్పించడంతో.. ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ అశ్వినీదత్ హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణను ఆపేయాలని ఆయన గత నెలలో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.