ఒంగోలు: గ్రానైట్ లీజును రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుకి ఏపీ హైకోర్టులో గురువారంనాడు ఊరట లభించింది. 

ఈ నెల 25వ తేదీన ప్రకాశం జిల్లాలోని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుకి చెందిన గ్రానైట్ క్వారీ లీజులను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది.ఈ నోటీసులపై ఏపీ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు. 

పోతుల రామారావుకి చెందిన సదరన్ రాక్ అండ్ మినరల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ప్రభుత్వం జారీ చేసిన లీజు రద్దు నోటీసులను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన నోటీసులు చట్టబద్దంగా లేవని హైకోర్టు అభిప్రాయపడింది.

also read:ఒంగోలు టీడీపీ నేతలకు జగన్ షాక్: గొట్టిపాటి, పోతుల రామారావు గ్రానైట్ క్వారీ లీజుల రద్దు

రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  ఈ గ్రానైట్ తవ్వకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఈ కంపెనీలకు పెద్ద ఎత్తున జరిమానాలను కూడ విధించారు.  

రాజకీయంగా  ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశ్యంతోనే  టీడీపీకి చెందిన నేతల గ్రానైట్ కంపెనీల్లో తనిఖీలు నిర్వహించడమే కాకుండా భారీ మొత్తంలో జరిమానాలు విధించారని అప్పట్లో టీడీపీ నేతలు విమర్శించారు.

తమ పార్టీకి చెందిన నేతలు, ప్రజా ప్రతినిదుల వ్యాపారాలను దెబ్బతీసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తోందని టీడీపీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.