ఎస్ఈసీ ఆదేశాలపై మంత్రి కొడాలి పిటిషన్: ఎల్లుండికి వాయిదా వేసిన హైకోర్టు
ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.
అమరావతి: ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.
ఈ నెల 21వ తేదీ వరకు మీడియాతో మాట్లాడొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ మంత్రి కొడాలి నాని ఆదివారం నాడు ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై విచారణను ఆదివారం నాడు హైకోర్టు స్వీకరించింది. నిన్నటి విచారణకు కొనసాగింపుగా ఇవాళ విచారణను చేపట్టింది.మంత్రి కొడాలి నాని తరపు న్యాయవాది, ఎన్నికల సంఘం న్యాయవాది చేసిన వాదనలు విన్న హైకోర్టు విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.
ఇరువర్గాల వాదనలతో కోర్టు సంతృప్తి చెందలేదు. వాస్తవాలు తెలపడంలో విఫలమయ్యారని కోర్టు అభిప్రాయపడింది. సీనియర్ న్యాయవాదిని అమికస్ క్యూరీగా నియమిస్తామని హైకోర్టు ప్రకటించింది.
ఎస్ఈసీని కించపర్చేలా మంత్రి నాని వ్యాఖ్యలు చేశారనే నెపంతో ఈ నెల 12వ తేదీన ఎస్ఈసీ మంత్రి నానికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.ఈ షోకాజ్ నోటీసుల విషయంలో మంత్రి చెప్పిన సమాధానానికి సంతృప్తి చెందని ఎస్ఈసీ కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఆదివారం నాడు కృష్ణా జిల్లా పోలీసులకు అందాయి.ఈ విషయమై కృష్ణా జిల్లా పోలీసులు న్యాయ సలహా కోసం పంపారు.