దేవాదాయ శాఖ నిధులను అమ్మబడి పథకానికి మళ్లిస్తున్నారంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై అడ్వకేట్ జనరల్ శుక్రవారం వాదనలు వినిపించారు.

వీధుల్లో మాట్లాడుతున్న మాటలను పిల్స్‌ రూపంలో వేస్తున్నారని, కనీస వివరాలు లేకుండా పిల్స్‌ వేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పిల్స్‌ వేయడాన్ని ఒక జోక్‌గా భావిస్తున్నారన్నారు.

దేవాదాయ శాఖలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ భాగంకాదని... అయినా నిధులు మళ్లిస్తున్నట్లు జీవోలో ఎక్కడా చెప్పలేదని ఆయన పేర్కొన్నారు. పరిపాలనా సౌలభ్యంకోసం మాత్రమే దేవాదాయ శాఖ కమీషనర్, కార్పోరేషన్‌కు హెచ్‌ఓడీగా ఉంటారని ఏజీ చెప్పారు.

వీధుల్లో మాట్లాడుకునే ప్రతి మాటలను ప్రజాప్రయోజన వ్యాజ్యాల రూపంలో దాఖలు చేస్తున్నారని... ఇలాంటి వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరంలేదని ఏజీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

జీవోలో బడ్జెట్‌కేటాయింపులు అంశాన్ని దాఖలు చేయలేదు? ఎంత బడ్జెట్‌ ఇచ్చారో చెప్పడంలేదన్నారు. దేవాదాయ శాఖనిధులను అమ్మ ఒడికి బదిలీచేశారంటూ చేస్తున్న వాదనలకు తగిన వివరాలను కూడా పిటిషనర్‌ పొందుపరచలేదని అడ్వకేట్ జనరల్ అన్నారు.

నిధులను మళ్లిస్తున్నట్లుగా జీవోలో సైతం చెప్పలేదని ఏజీ పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం అమ్మ ఒడి పథకానికి దేవాదాయశాఖ నిధులు మళ్లించారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. పిటిషన్‌ను కొట్టివేసేందుకు హైకోర్టు  సిద్ధమైంది. అయితే మరిన్ని పత్రాలను సమర్పించేందుకు పిటిషనర్ గడువు కోరారు.