రాజధాని నిర్మాణానికి చంద్రబాబునాయుడు నిధులను సమీకరించాలని అనుకుంటున్నారట. అందుకు సిఆర్డీఏ రంగం కూడా సిద్ధం చేసిందట. రాజధాని నిర్మాణానికి రూ. 12 వేల కోట్లు సమీకరించాలని చంద్రబాబు నిర్ణయించారు. బాండ్లను విడుదల చేయటం ద్వారా పై మొత్తం సమీకరిస్తారట. ఇందులో దేశీయంగా రూ. 10 వేల కోట్లు, విదేశీల నుండి రూ. 2 వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు అనుమతి కోసం కేంద్రప్రభుత్వానికి లేఖ రూపంలో ప్రతిపాదన పంపింది. కేంద్రం ఏమి చేస్తుందన్నది వేరే సంగతి.

అయితే నిధుల సమీకరణ విషయంలోనే పలువురికి అనుమానాలు మొదలయ్యాయి. రాజధాని నిర్మాణ బాధ్యతను చంద్రబాబు సింగపూర్ సంస్ధల మీద పెట్టిన సంగతి తెలిసిందే. విభజన చట్ట ప్రకారం సచివాలయం, అసెంబ్లీ, రాజ్ భవన్, హైకోర్టు నిర్మించాల్సిన బాధ్యత కేంద్రానిదే. కానీ చంద్రబాబు కేంద్రానికి ఆ బాధ్యత అప్పగించలేదు.

పైగా హైకోర్టు, రాజ్ భవన్, అసెంబ్లీ, సచివాలయం నిర్మాణానికి కేంద్రం విడుదల చేసిన రూ. 1600 కోట్లు వ్యయం చేసేసారు. హైకోర్టు, రాజ్ భవన్ నిర్మాణాలకు ఖర్చు పెట్టినట్లు ఈ మధ్య యుటిలైజేషన్ సర్టిఫికేట్ కూడా కేంద్రానికి పంపటం  మరీ విడ్డూరం. నిజంగానే హై కోర్టు, రాజ్ భవన్ నిర్మాణానికి నిధులు ఖర్చు చేస్తే మరి ఆ భవనాలు కంటికి కనబడాలి కదా?

సరే, ఇక ప్రస్తుత విషయానికి వస్తే రాజధాని నిర్మాణమంపై చంద్రబాబు ఇప్పటికే అనేక మార్లు పిల్లిమొగ్గలేసారు. రాజధాని నిర్మాణంలో పాలుపంచుకోమంటూ పలు దేశాలకు ఆహ్వానాలు పంపారు. కాబట్టి రాజధాని నిర్మించే బాధ్యత ఏ దేశానికి కట్టబెడతారో ఎవరికీ తెలీదు. అసలు, 37వేల ఎకరాలను  సమీకరించింది ఎందుకు? ఆ భూములను బ్యాంకులు, ఆర్ధిక సంస్ధల్లో కుదవపెట్టి నిధులు సమీకరించి నిర్మాణాలు చేస్తామని చంద్రబాబే గతంలో స్వయంగా చెప్పారు.

మరి, రాజధాని నిర్మాణం కోసమంటూ తాజాగా బాండ్ల విడుదల ఎందుకు చేయాలనుకుంటున్నారు? రూ. 12 వేల కోట్ల సమీకరణ అంటే ఎంతకాలం పడుతుందో తెలీదు? ఇంకోవైపు చాలా కాలంగా సింగపూర్ సంస్ధల చప్పుడూ వినబడటం లేదు. విదేశీ బాండ్లను సింగపూర్, లండన్ స్టాక్ ఎక్స్చేజ్ ద్వారా విడుదల చేయాలని సిఆర్డీఏ భావిస్త్తోంది. ఇదంతా ఎప్పటికయ్యేనో ఏమో? మొత్తానికి రాజధాని నిర్మాణమన్నది బ్రహ్మపదార్ధం లాగ తయారైంది.