ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుకు భద్రత తగ్గించడంతో పాటు గన్నవరం విమానాశ్రయంలో ఆయనను సాధారణ వ్యక్తిలా తనిఖీ చేయడంపై ఆ పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీలోని కీలక నేతలకు భద్రతను కుదిస్తూ భద్రతా సమీక్షా కమిటీ తీసుకున్న నిర్ణయం కొత్త వివాదానికి దారి తీసేలా కనిపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, జలీల్ ఖాన్, తంగిరాల సౌమ్య, శ్రీరాం రాజగోపాల్, బోడె ప్రసాద్‌కు ఉన్న 1+1 భద్రతను వారు ఎన్నికల్లో ఓడిపోయిన అనంతరం తొలగించారు.

అయితే ఎన్నికల్లో గెలిచినప్పటికీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు భద్రతను సగానికి తగ్గించారు. మాజీ ఎమ్మల్యే బొండా ఉమాకి నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో 1+1 భద్రతను కల్పిస్తున్నారు.

ఇక మాజీ మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర భద్రతను 1+1కు తగ్గించారు. ఈ నిర్ణయాలను సంబంధిత పోలీసు యూనిట్లకు అందజేశారు. వీటిని అధికారులు రెండ్రోజుల నుంచి అమలు చేస్తున్నారు.

తనకు ఉన్న 2+2 భద్రతను 1+1కు తగ్గించడంపై బుద్దా అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుత మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్నినాని, కొడాలి నానిలకు 2+2 గన్‌మెన్‌లతో పాటు ఎస్కార్ట్‌ను కల్పించాలని భద్రతా సమీక్షా కమిటీ నిర్ణయం తీసుకుంది.