AP Govt Regularizes 870 Old Layouts: ఆంధ్రప్రదేవ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎప్పటి నుంచో పట్టణాభివృద్ది సంస్థ నుంచి అనుమతులకు నోచుకోక లేవట్లు అడవులుగా మారాయి. ఈక్రమంలో ఆ పాత లేఅవుట్లు అన్నింటినీ క్రమబద్దీకరణకు కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలోని 85 వేల కుటుంబాలకు లబ్ది చేకూర్చినట్లైంది.
సొంతింటి కల నెరవేర్చుకోవాలన్న లక్ష్యంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రియల్‌ఎస్టేట్ వ్యాపారాలు వేసిన లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేస్తుంటారు. అయితే.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఆయా లేఅవుట్ల ప్రారంభం నుంచి గరిష్టంగా మూడేళ్ల వ్యవధిలోనే రోడ్లు, కాలువలు, వీధిదీపాలు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా గత పదేళ్ల కాల వ్యవధిలో ఆ నిబంధనలను సుమారు 870 లేఅవుట్లు వేసిన వ్యాపారులు పాటించలేదు. దీంతో వాటికి పట్టణాభివృద్ది సంస్థ నుంచి అనుమతులు ఇవ్వలేదు. దీని వల్ల ఆ లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేసుకున్నవారికి తీవ్ర నష్టం జరిగింది. ప్రభుత్వ అనుమతులు లేకపోవడంతో అటు ఇళ్లు నిర్మించుకోలేక, ఇటు బ్యాంకుల నుంచి కనీసం రుణం పొందలేక, ఎవరికీ అమ్ముకోలేక ఇలా అనేక ఇబ్బందులు పడ్డారు.

రాష్ట్రంలోని 870 లేఅవుట్లకు సంబంధించిన లబ్దిదారులు తాము ఇలా స్థలం కొనుగోలు చేసి నష్టపోతున్నామని, న్యాయం చేయాలని గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలకు మొరపెట్టుకుంటున్నారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ దశలో కూటమి ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి ముందుకొచ్చింది. పాత లేఅవుట్లకు అనుమతులను తిరిగి పునరుద్ధరించాలన్న సర్కార్ నిర్ణయం 85,000ల కుటుంబాలకు మేలు చేసినట్లు అవుతుంది.
సుమారు 15 నుంచి 20 సంవత్సరాల కిందట వివిధ పట్టణాభివృద్ధి సంస్థల నుంచి అనుమతులు తీసుకుని, గడువులోగా నిర్దేశించిన పనులు పూర్తిచేయని 870 లేఅవుట్లకు అధికారులు అనుమతులను తిరిగి పునరుద్ధరించనున్నారు. అలాంటి స్థలాలు ఏపీ సీఆర్డీఏ పరిధిలోనే అత్యధికంగా 624 లేఅవుట్లు ఉన్నాయి. దీంతోపాటు విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, శ్రీకాకుళం, పుట్టపర్తి ప్రాంతాల్లో మిగతా లేఅవుట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో సుమారు 85,000ల ప్లాట్లు ఉన్నాయి.
ఈ లేఅవుట్లలో ప్లాట్లను ఇప్పటికే అందరికీ విక్రయించేశారు. ఈక్రమంలో ప్రభుత్వం స్పందించి ఆయా ఫ్లాట్లలో ఇళ్ల నిర్మాణానికి పట్టణ ప్రణాళిక విభాగం అనుమతులివ్వడంతో కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
సుమారు 870 లేఅవుట్లలో అనుమతులు పునరుద్ధరించుకోని కారణంగా ఇంటి నిర్మాణాలకు సంబంధించి గత 12 ఏళ్లలో దాదాపు 10,000ల అర్జీలు చేసుకోగా.. వాటిని ప్రభుత్వం వెనక్కి పంపింది. ఆ స్థలాలకు ఎల్‌పీ నంబర్ లేని కారణంగా బ్యాంకులూ ఇళ్ల నిర్మాణానికి రుణాలు ఇవ్వని పరిస్థితి. ఈ నేపథ్యంలో కొనుగోలుదారుల అవస్థలపై ప్రభుత్వం స్పందించింది. ఒక్కసారే ఏకకాల పరిష్కారం కింద అనుమతులు పునరుద్ధరించుకునే అవకాశం కల్పించింది. డెవలప్‌మెంట్ ఛార్జీలనూ మినహాయించింది. ఈ విషయాన్ని వ్యాపారులకు చెప్పారు. దీంతో లేఅవుట్ల అనుమతులు పునరుద్ధరించుకునేందుకు వ్యాపారులు సిద్దమయ్యారు.
